తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన నివాసంలో కన్నుమూశారాయన. రాజ్ మరణంపై తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంగీత దిగ్గజానికి నివాళులు అర్పించారు. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా రాజ్‌తో సుమారు 180కు సినిమాలకు పనిచేసిన కోటి తన మిత్రుడి భౌతికకాయాన్ని చూసి తట్టుకోలేకపోయారు. చివరిచూపు చూసుకొని కన్నీరుపెట్టుకున్నారు.
కాగా రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలనాటి సంగీత దర్శకుడు టీవీరాజు కుమారుడే రాజ్. .ప్రళయగర్జన సినిమాతో సినీ సంగీత ప్రస్థానం ప్రారంభించిన రాజ్.. మరో మ్యూజిక్ డైరెక్టర్ కోటితో కలిసి.. ఎన్నో మరుపురాని పాటలు అందించారు. ప్రధానంగా 90వ దశకంలో తమ సంగీతంతో ఒక ఊపు ఊపేశారు రాజ్ కోటి.వీళ్లిద్దరూ కలిసి 180కి పైగా సినిమాలకు సంగీతం అందించారు.అయితే.. అనుకోని పరిస్థితుల్లో కోటి నుంచి విడిపోయిన రాజ్.. సొంతంగా పది సినిమాలకు సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..