Bharathi Raja: దర్శక దిగ్గజం, నటుడు, నిర్మాత భారతీరాజా (Bharathi Raja) మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అంజిగరైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అనారోగ్యం కారణంగా గత నెల 24న ఇదే హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు భారతీరాజా. జలుబు, అజీర్ణం తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు అత్యవసర విభాగంలో వైద్య సేవలు అందించారు. సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారీ లెజెండరీ డైరెక్టర్. ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దిగ్గజ దర్శకుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అలాగే నటి రాధికతో సహా పలువరు ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేశారు. అంతా బాగుందన్న తరుణంలోపే మళ్లీ ఆయన అస్వస్థతకు గురికావడం, ఆస్పత్రికి తరలించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దిగ్గజ దర్శకుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా ’16 వయత్తినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు)తో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు భారతీ రాజా. ఆ తర్వాత కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని తదితర కల్ట్ క్లాసిక్ చిత్రాలతో దిగ్గజ దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. డైరెక్టర్‌గా బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం నటుడిగానూ సత్తా చాటుతున్నారు. గత కొన్ని నెలలుగా వరుసగా సినిమాల్లో నటిస్తోన్న ఆయన మధురై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయారు. ఆయన్ను గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని అజీర్ణం కారణంగా స్పృహ తప్పి పడిపోయాడని తెలిపారు. ఆతర్వాత ఆస్పత్రిలో చేరారు. కాగా ఇటీవలే ధనుష్, నిత్యామేనన్, రాశీఖన్నా నటించిన తిరు చిత్రంలో ఈ దిగ్గజ దర్శకుడు ఓ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.