ఆ హీరోని చూడగానే ఫిదా అయ్యా.. ఆయన కోసమే ఆ కథ రాసుకొని సినిమా చేశా: కృష్ణవంశీ
దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన దర్శకత్వ ప్రస్థానం, పలు ప్రాజెక్టులు, వ్యక్తిగత అభిప్రాయాలపై మాట్లాడారు. అలాగే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మురారి సినిమా గురించి, దాని వెనక ఉన్న కథ గురించి పంచుకున్నారు.

దర్శకుడు కృష్ణవంశీ, తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటైన మురారి వెనుక ఉన్న అసలు కథను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతి సినిమాకు ఒక బలమైన పునాది, ప్రేరణ ఉంటాయని ఆయన అన్నారు. మురారి కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదని, అనేక ఆసక్తికరమైన సంఘటనలు, వ్యక్తిత్వాల కలయికతో రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. మురారి చిత్రానికి ప్రధాన కారకుడు దివంగత నిర్మాత రామలింగేశ్వరరావు. ఆయన నటుడు కృష్ణ గారికి వీరాభిమానినని. కృష్ణ గారి కొడుకు మహేష్ బాబును హీరోగా పరిచయం చేయాలనే బలమైన కోరికతో ఆయన సినీ రంగంలోకి వచ్చారు. కృష్ణ గారు స్వయంగా రామలింగేశ్వరరావును మహేష్ బాబు తొలి చిత్రం తీసుకోమని సూచించారు. అయితే, రామలింగేశ్వరరావు మాత్రం కృష్ణవంశీ దర్శకత్వంలోనే సినిమా చేయాలని పట్టుబట్టారు. “వంశీతోనే చేస్తాను, ఆయన మంచి డైరెక్టర్, తెచ్చుకో” అని కృష్ణ గారు సూచించగా, రామలింగేశ్వరరావు కృష్ణవంశీని సంప్రదించారట. ఆ సమయంలో కృష్ణవంశీ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో, వెంటనే మురారిని చేపట్టలేకపోయారు. “సారీ సార్, మీరు వేరే డైరెక్టర్‌తో చేసుకోండి” అని కృష్ణవంశీ చెప్పినా, రామలింగేశ్వరరావు మాత్రం వెనక్కి తగ్గలేదు. “లేదు సార్, నేను మీతోటే చేయాలి, మీరు, మహేష్ కాంబినేషన్” అని బతిమాలారు. కృష్ణవంశీ ఫ్రీ అయ్యే సమయానికి మహేష్ బాబు రాజకుమారుడు వంటి మరో చిత్రాన్ని ప్రారంభించారు. అయినా, రామలింగేశ్వరరావు తన పట్టుదలను వీడలేదు. ఆయన పట్టుదల వల్లే మురారి ప్రాజెక్ట్ ముందుకు కదిలిందని కృష్ణవంశీ గుర్తుచేసుకున్నారు.
మహేష్ బాబును మొదటిసారి చూడగానే, రచయిత్రి తెన్నేటి హేమలత రాసిన మోహన వంశీ పుస్తకం గుర్తుకు వచ్చిందని కృష్ణవంశీ తెలిపారు. ఆ పుస్తకం కృష్ణుడు బృందావనంలో గడిపిన బాల్యం గురించి వివరిస్తుంది. మహేష్‌తో ఒక బృందావనం లాంటి సినిమా చేయాలని, పచ్చదనంతో, గోపికలు, గొల్ల కన్నెలు, రంగులమయమైన వాతావరణంతో కూడిన ఒక కృష్ణుడు నేపథ్యాన్ని సృష్టించాలని ఆయనకు అనిపించింది. ఈ ఆలోచన నుంచి ప్రేరణ పొంది, కృష్ణావతారంపై లోతైన పరిశోధన ప్రారంభించారు. పోతన భాగవతం చదవడం, ఓషో రాసిన కృష్ణ పుస్తకాన్ని అధ్యయనం చేయడం, ఎన్.టి.రామారావు కృష్ణుడు సినిమాలు (కృష్ణావతారం, కృష్ణార్జున యుద్ధం వంటివి) చూడటం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.
అలా పరిశోధన చేస్తూ గోదావరి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, స్నేహితులతో సంభాషణల మధ్య శాపం అనే కాన్సెప్ట్ తట్టింది. ఈ శాపం ఆలోచనకు రెండు ప్రధాన సంఘటనలు స్ఫూర్తినిచ్చాయి. ఒకటి, ఇందిరా గాంధీ కుటుంబంలో జరిగిన వరుస బలవన్మరణాలు ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ అందరూ దారుణంగా ప్రాణాలు కోల్పోవడం. ఇది ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందని కృష్ణవంశీకి అనిపించింది. రెండోది, కృష్ణా లేదా గుంటూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద ఎంపీ కుటుంబంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు కొడుకులు చనిపోవడం. ఒక పనిమనిషి పెట్టిన శాపమే దీనికి కారణమని అప్పట్లో ప్రచారంలో ఉండేది. ఈ రెండు సంఘటనలను ఆధారం చేసుకొని, శ్రీకృష్ణుడి బాల్యానికి ముడిపెట్టి (దేవకికి ఏడుగురు పిల్లలు చనిపోయిన తర్వాత ఎనిమిదోవాడిగా కృష్ణుడు జన్మించడం) శాపం కాన్సెప్ట్‌ను మురారి కథలో పొందుపరిచారట. ఈ విధంగా చారిత్రక, పౌరాణిక సంఘటనల నుంచి స్వీకరించిన ప్రేరణల కలయికతో మురారి సినిమా రూపుదిద్దుకుందని కృష్ణవంశీ తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
