AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. నదిలో పడిన స్కార్పియో.. ఆరుగురు మృతి!

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తిలక్ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కుటుంబ సభ్యుల వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు మృత్యువాత పడగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పెళ్లి వేడుకలో పాల్గొని ఆనందంగా తిరిగి వస్తున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. నదిలో పడిన స్కార్పియో.. ఆరుగురు మృతి!
Bihar Tragedy
Balaraju Goud
|

Updated on: Nov 19, 2026 | 9:03 AM

Share

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తిలక్ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కుటుంబ సభ్యుల వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు మృత్యువాత పడగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పెళ్లి వేడుకలో పాల్గొని ఆనందంగా తిరిగి వస్తున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని అరేరియా జిల్లా తారాబారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బీడీ వంతెనపై అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సుపాల్ జిల్లా పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్హా గ్రామానికి చెందిన కొందరు స్కార్పియో వాహనంలో అరేరియా జిల్లాలోని సిక్తి ప్రాంతం భాపటియా గ్రామంలో జరిగిన తిలక్ వేడుకకు వెళ్లారు. వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా బీడీ వంతెనపై ఉన్న పదునైన మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో రెప్పపాటులో వంతెనపై నుంచి మరియా నదిలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న వారేనని సమాచారం. మరో యువకుడు ప్రాణాలతో బయటపడగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రమాదం జరిగిన సమయంలో వినిపించిన కేకలు విన్న స్థానికులు వెంటనే నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎంతో శ్రమించి నదిలో మునిగిపోయిన స్కార్పియోను బయటకు తీశారు. అందులో చిక్కుకున్న వారిని అరేరియా సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆరుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వాహనం అదుపుతప్పడానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒకవైపు పెళ్లి వేడుకతో సందడిగా ఉన్న కుటుంబంలో మరోవైపు ఆరుగురి మరణంతో తీరని విషాదం నెలకొంది. తుమ్హా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి సంబరాలు కాస్తా కుటుంబ సభ్యుల కన్నీటి పర్యంతంగా మారాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us