దూకుడు సినిమాలో ఆ హీరో చేయాల్సింది.. ఆయన చెప్పాడని ప్రకాష్ రాజ్‌ను తీసుకున్నాం
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇది. అలాగే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కెరీర్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. వాటిలో దూకుడు సినిమా ఒకటి. మహేష్, సమంత జంటగా దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్, సోను సూద్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ వంటి స్టార్ యాక్టర్స్ తో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది. థమన్ సంగీతం అందించిన దూకుడు ఇండస్ట్రీని షేక్ చేసింది. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది దూకుడు మూవీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం రీ రిలీజ్ లోనూ అదరగొట్టింది. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే కదలకుండా చూస్తుంటారు ఆడియన్స్. ఇక దర్శకుడు శ్రీను వైట్ల గతంలో ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. దూకుడు కథ కేబీఆర్ పార్క్‌లో పుట్టిందని తెలిపారు. అలాగే ఈ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుందని మేకింగ్ దశలోనే తాను నమ్మానని శ్రీను వైట్ల తెలిపారు. ఇదే విషయాన్ని మహేష్ బాబుకు కూడా చాలా సార్లు చెప్పానని ఆయన అన్నారు.
మహేష్ బాబు మాస్ స్టెప్పులు, డైలాగులు థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టించాయని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో మిలియన్ డాలర్ మార్కును దాటడం అరుదు కాగా, దూకుడు 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని నిర్మాత నవీన్ యెర్నేని చెప్పారని శ్రీను వైట్ల వెల్లడించారు. దర్శకుడిగా తాను డైలాగులకు, వాటి టైమింగ్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తానని శ్రీను వైట్ల అన్నారు. మహేష్ బాబుతో తన వేవ్ లెంత్ బాగా కుదరడంతో, ఆయన డైలాగులను అద్భుతంగా చెప్పారని. ఇస్తాంబుల్ షెడ్యూల్ కోసం ముందుగానే డైలాగులు రాసి మహేష్ బాబుకు వినిపించినట్లు చెప్పారు.
“మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను” వంటి డైలాగ్ మహేష్ బాబు చెప్పినప్పుడు తనకు మరింత శక్తిని ఇచ్చాయని, ఇంకా రాయడానికి స్ఫూర్తినిచ్చాయని వైట్ల వివరించారు. “ఏయ్ మళ్ళీ వేశాడు” అనే ఐకానిక్ డైలాగ్ తన స్నేహితుడి మ్యానరిజం నుంచి వచ్చిందని, మహేష్ బాబు తనకంటే బాగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబును డైరెక్టర్స్ డిలైట్ అని అభివర్ణించిన వైట్ల, ఆయన ఎంతో మద్దతుగా ఉంటారని పేర్కొన్నారు. వ్యక్తిగా ఆయన చాలా హాస్యం, వినయం గలవారని, కొత్త డైరెక్టర్లని కూడా “సార్” అని పిలుస్తారని తెలిపారు. మహేష్ బాబుతో పనిచేసినప్పుడు ఒత్తిడి ఉండదని, ఆయన చాలా మంచి మనిషి అని కొనియాడారు. దూకుడు స్క్రిప్టును మహేష్ బాబును దృష్టిలో పెట్టుకునే రాశానని శ్రీను వైట్ల స్పష్టం చేశారు. అయితే ప్రకాష్ రాజ్ పాత్ర కోసం మొదట నటుడు శ్రీహరిని అనుకున్నా.. విషయం శ్రీహరికి చెప్తే ఆయన ఇప్పుడే నేను తండ్రి పాత్రలు చేయాలా.? అని ఆలోచించారని శ్రీహరి ఆ డైలమాలో ఉన్నప్పుడే.. మహేష్ కు ఇదే విషయం చెప్తే శ్రీహరి అప్పుడే తండ్రి పాత్రలు వద్దు అనుకుంటున్నారుగా.. ఆయనను ఇబ్బందిపెట్టకండి. ఆ పాత్ర మనం ప్రకాష్ రాజ్ కు ఇద్దాం.. అన్నాడు. మహేష్ బాబు సూచన మేరకు ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశామని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా అద్భుతంగా చేశారని అన్నారు శ్రీను వైట్ల.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
