AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కల్లు డబ్బాకు తాళం.. దొంగలకు చెక్ పెట్టిన తాత!

దొంగలు పడకుండా ఉండేందుకు ఇంటికి తాళం వేయడం చూశాం.. బైక్‌కు చైన్ వేసి భద్రపరచుకోవడం చూశాం.. కానీ రోజూ కష్టపడి సేకరించిన పదార్థం.. ఇంటికి చేరకముందే మాయమవుతుంటే.. ఇక లాభం లేదనుకున్న ఆ తాత ఓ వినూత్న ఆలోచనకు పదును పెట్టారు. ఈ తాత ఐడియా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమస్య ఏదైనా సరే.. పరిష్కారం మాత్రం తాత స్టైల్లో ఉండాలంటూ నవ్వుకుంటున్నారు. ఇంతకీ తాత సూపర్ ఐడియా ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: కల్లు డబ్బాకు తాళం.. దొంగలకు చెక్ పెట్టిన తాత!
Toddy
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 19, 2026 | 8:38 AM

Share

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సర్నేనిగూడెంకు చెందిన బండమీది అంజయ్య గౌడ్ కొన్నేళ్లుగా కల్లు గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఈత చెట్టు నుంచి కల్లు సేకరించి డబ్బాలో భద్రపరచడం ఆయనకు నిత్యకృత్యం. అయితే కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు కల్లు డబ్బాలను ఎత్తుకెళ్తున్నారట. రోజూ ఇదే తంతు కొనసాగడంతో ఆయనకు విసుగొచ్చింది. కష్టపడి సేకరించిన కల్లు ఇలా దొంగల పాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం ఎందుకని ఆలోచించాడు. చివరకు తనదైన ఐడియాతో ఈ తాత రూటే మార్చేశాడు.

రూ.500తో దొంగలకు చెక్..

రోజూ మాయమవుతున్న తన కష్టార్జితాన్ని కాపాడుకునేందుకు అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పెద్దగా భద్రతా ఏర్పాట్లూ చేయలేదు. తన కల్లు డబ్బాలను కాపాడుకునేందుకు వచ్చిన ఆలోచన మాత్రం అదిరిపోయింది. వెంటనే రూ.500 ఖర్చు చేసి ఓ గొలుసు, తాళం కొనుగోలు చేశాడు. గొలుసును కల్లు డబ్బాకు బిగించి, మరోవైపు తాళం వేశాడు. అంతే.. అప్పటివరకు స్వేచ్ఛగా కల్లు డబ్బాలను ఎత్తుకెళ్తున్న దొంగలకు చెక్ పడింది. తాళం తీయకుండా డబ్బాను తీసుకెళ్లడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. తన కష్టార్జితానికి ఇక భద్రత లభించిందని అంజయ్య ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

తాత ఐడియాకు గ్రామస్తుల ఫిదా!

సాధారణంగా ఇంటికి, బీరువాకు, బండికి తాళం వేస్తుంటారు. కానీ కల్లు డబ్బాకు తాళం వేయడమే ఇక్కడ అసలు ట్విస్ట్. అంజయ్య చేసిన ఈ వినూత్న ప్రయోగం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. కొందరు నవ్వుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన తెలివిని మెచ్చుకుంటున్నారు. దొంగతనాలను అరికట్టేందుకు పెద్దపెద్ద ఏర్పాట్లే అవసరం లేదని, చిన్న ఆలోచన కూడా మంచి పరిష్కారాన్ని చూపిస్తుందని ఈ ఘటన చెబుతోంది.

Follow Us