కన్నడ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో పరుగులు తీస్తోంది. కేజీయఫ్ వేసిన బాటలో నడవడానికి పలు చిత్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రేసులో ఉన్న చిత్రమే కాంతార. పూర్తిగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా. కర్ణాటకలో మంచి పేరు రావడంతో మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు. మరి కాంతారా అన్ని భాషల వాళ్లకూ నచ్చుతుందా?
నిర్మాణం: హోంబలే ఫిల్మ్స్
రచన : దర్శకత్వం: రిషబ్ శెట్టి
నిర్మాత: విజయ్ కిరగందూర్
నటీనటులు: రిషబ్ శెట్టి, కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడ తదితరులు
కెమెరా: అరవింద్.ఎస్.కశ్యప్
ఎడిటింగ్: కె.ఎం.ప్రకాష్, ప్రతీక్‌శెట్టి
సంగీతం: బి.అజనీష్ లోకేష్
1847లో ఓ రాజుకు మనశ్శాంతి కరవవుతుంది. వెతుక్కుంటూ ఒంటరిగా అడవులబాట పడతాడు. ఓ ప్రాంతంలో ఓ రాయిని చూడగానే అతనికి తల్లి, మేనమామ ఆదరణ దొరికినట్టు అనిపిస్తుంది. ఆ రాయిని తనతో తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే స్థానికులు అందుకు ఒప్పుకోరు. వాళ్లు నమ్మే దేవుడు వాళ్లల్లో ఒకరిపై పూని తన కేక వినిపించనంత దూరం ఉన్న ప్రాంతాన్ని వారికి ఇచ్చి, ఆ రాయిని తీసుకెళ్లమంటాడు. మాటతప్పితే విపత్తు తప్పదని హెచ్చరిస్తాడు. సరేనని రాజు యథాప్రకారం చేస్తాడు. అయితే, అతని వారసుల్లో ఒకడు 1970లో అటవీజనాల నుంచి ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం కక్కుకుంటూ కోర్టు మెట్ల మీద పడి చనిపోతాడు.
అప్పటి నుంచి వారసులు ఆ పనులు మానుకుంటారు. అలా కథ 1990కి చేరుతుంది. రాజ కుటుంబం వారసుడు దొర (అచ్యుత్) ఆ ఊళ్లో మంచి చెడులన్నీ చూసుకుంటుంటాడు. ఇటు కోలం (మనిషి మీద దేవుడు పూనే ఉత్సవం) ఆడేవాళ్లలోనూ కొత్త జనరేషన్ వాళ్లు తయారై ఉంటారు. ఎప్పుడూ కోలం ఆడే అతని కుమారుడు కాకుండా, అతని సోదరుడి కుమారుడు కోలం ఆడుతాడు. సొంత కొడుకు శివ బలాదూర్‌గా తిరుగుతుంటాడు. శివకు ఎప్పుడూ ఎవో కలలు వచ్చి ఉలిక్కిపడుతుంటాడు. ఈ క్రమంలోనే ఆ అడవీ ప్రాంతానికి మురళీధర్ (కిశోర్) ఫారెస్ట్ ఆఫీసర్‌గా వస్తాడు. ఆ ప్రాంతాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ చేయాలన్నది అతని సంకల్పం. కానీ చాపకింద నీరులా దొర కుయుక్తులతో అక్కడి ప్రజల నుంచి ఆ ప్రాంతాన్ని రాయించుకుంటుంటాడు. ఇన్నిటి మధ్య లోకల్ అమ్మాయి లీల కూడా ఫారెస్ట్ ట్రయినింగ్ పాస్ అయి ఉద్యోగంలో చేరుతుంది. శివకు, లీలకు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంటుంది.
ఎప్పుడూ కోలం ఆడే శివ తమ్ముడు చనిపోతాడు. ఆ సమయంలో శివ జైలులో ఉంటాడు. శివ జైలుకు ఎందుకెళ్లాడు? అతని సోదరుడు ఎలా చనిపోయాడు? ఆ హత్యలకు కారణం ఎవరు? మురళీనా? లేకుంటే దొరా? ఇంతకీ చివరికి ఏమైంది? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ఉడుపి ప్రాంతంలో వినిపించే జానపద కథతో సినిమా చేశారు రిషబ్. శివ కేరక్టర్‌లో బెస్ట్ వేరియేషన్ చూపించారు. కోలం ఆడేటప్పుడు అతని హావభావాలు హైలైట్. అలాగే బలాదూర్‌గా తిరిగేటప్పుడు కూడా పాత్రలో జీవించేశారు. సినిమాలో మిగిలిన వాళ్లు కూడా ఆయా కేరక్టర్లకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. డైలాగులు బావున్నాయి. నవ్విస్తున్నాయి. రాత్రిపూట అడవుల్లో టీమ్ పడ్డ కష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. కెమెరా పనితనం కూడా హైలైట్. క్లైమాక్స్ ముందు పావు గంట మాత్రం మరో రేంజ్‌లో ఉంటుంది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. కాకపోతే అడవులు, అక్కడి ప్రజలు, వారి నమ్మకాలు, కోలం, కన్నడ మాటలు… ఇవన్నీ కన్నడలో క్లిక్ కావడం బాగానే ఉంది. కానీ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాయన్నదే సందేహం. రిషబ్ నటుడిగా సెంట్ పర్సెంట్ న్యాయం చేశారు. డైరక్టర్‌గానూ ఓకే. కాకపోతే, ఆ జానపద కథలో కనిపించే పర్టిక్యులర్ ఎలిమెంట్స్ తెలుగువారికి ఎంత వరకు కనెక్ట్ అవుతాయన్నదే వేచి చూడాల్సిన విషయం.
అందుకే … ఆద్యంతం కొత్త ఎక్స్ పీరియన్స్ కలిగించే కాంతారా!
– డా. చల్లా భాగ్యలక్ష్మి