
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారెజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో హైప్ ఏర్పడింది. దేవర చిత్రంలో తారక్.. మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను క్రియేట్ చేశాయి. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ. గత కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక గత రెండు వారాలుగా ఈమూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా శనివారం యాక్షన్స్ సీన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాలు చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది.
ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరించారు.ఈ షెడ్యూల్లోనే హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఇక దేవర కోసం కెన్నీ బేట్స్ వంటి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ సైతం పిలిపించారు మేకర్స్. బేట్స్ నేతృత్వంలోపలు థ్రిల్లింగ్ సన్నివేశాలను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఇందులో తారక్ మత్య్స కారుడిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంటే 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.