Tollywood: కొరియోగ్రాఫర్‌తో లవ్‌లో ఉన్నానని ప్రకటించి అభిమానులకు షాకిచ్చిన యంగ్ బ్యూటీ!
ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో చోటు దక్కించుకుంది. తన క్యూట్, అమాయకమైన లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే క్రేజీ హిట్ అందుకుని కెరీర్‌కు మంచి బాటలు వేసుకుంది. చిన్న సినిమాలతో మొదలుపెట్టిన ఈ యంగ్ బ్యూటీ మంచి అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం ప్రయత్నిస్తోంది.

ఆరు అడుగుల పొడవు, అంతకు మించిన అందం.. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘చిట్టి’గా గూడు కట్టుకుంది ఆ హైదరాబాదీ భామ. ‘జాతిరత్నాలు’లో తన అమాయకమైన నటనతో, ఆకట్టుకునే డాన్స్‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవలే ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ పొడుగుకాళ్ల సుందరి, అకస్మాత్తుగా ఒక బాంబు పేల్చింది. తనను ప్రేమించే వారందరికీ ఒకేసారి షాక్ ఇస్తూ, తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు స్వయంగా వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందిన వాడే కావడం, అందులోనూ ఆమె కెరీర్ ఎదుగుదలకు తోడుగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరా అందగాడు? వీరి ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసుకుందాం.
ప్రేమలో పడ్డ చిట్టి..
చాలా మంది హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఫరియా అబ్దుల్లా మాత్రం తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ గా మాట్లాడేసింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మనసు దోచుకున్న వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. “నేను ప్రస్తుతం ఒక వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉన్నాను. ఆ విషయం నిజమే” అంటూ తన ప్రేమాయణాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఫరియా తన ప్రియుడి గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. “నేను ప్రేమిస్తున్న వ్యక్తి ముస్లిం కాదు, ఆయన హిందువు. వృత్తిపరంగా ఆయన ఒక కొరియోగ్రాఫర్. నా సినిమాల్లో నా డ్యాన్స్ ఇంత బాగా రావడానికి, నేను ఇంప్రూవ్ అవ్వడానికి ప్రధాన కారణం ఆయనే” అని చెప్పింది. కేవలం ప్రేమికులుగానే కాకుండా, ఇద్దరం ఒక టీమ్ లాగా కలిసి పని చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

Faria Abdullah
లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్..
ఒక నటిగా తన వర్క్ లైఫ్ ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో తన ప్రియుడి పాత్ర ఎంతో ఉందని ఫరియా కొనియాడింది. “ఆయన ప్రోత్సాహం వల్ల నేను ఏ విషయాన్నైనా సునాయాసంగా ఎదుర్కోగలుగుతున్నాను. మా మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమైంది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇప్పటి వరకు ఆ వ్యక్తి పేరు కానీ, ఫోటో కానీ ఆమె బయట పెట్టలేదు.
ఫరియా అబ్దుల్లా లవ్ మ్యాటర్ బయట పడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అంత పొడుగు ఉన్న నిన్ను ప్రేమించే ఆ అదృష్టవంతుడు ఎవరో ఒకసారి చూపించవచ్చు కదా చిట్టి!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆయన ఫోటో కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. త్వరలోనే ఆ కొరియోగ్రాఫర్ ఫోటోను ఫరియా రివీల్ చేస్తుందేమో చూడాలి. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఫరియా, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉందని అర్థమవుతోంది.
