సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. సీనియర్ నటుడి ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. కాగా చలపతిరావు మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రముఖ నటుడు చలపతిరావు మృతి చెందడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగానే కాకుండా సహాయనటుడిగానూ తనదైన శైలిలో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు. ఆయన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు, ఇతర కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా ఇలా కాలం చేయడం దురదృష్టకరం’ అని విచారం వ్యక్తం చేశారు పవన్.
అలాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి చలపతిరావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చలపతిరావు మృతి ఇండస్ట్రీకి తీరని లోటని వివేక్ అభిప్రాయపడ్డారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం నిర్వహించనున్నారు. ఆయన కూతురు అమెరికాలో ఉంటుండంతో ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
శ్రీ చలపతి రావు గారు మృతి బాధాకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/1RdM7NS5BX
— JanaSena Party (@JanaSenaParty) December 25, 2022
సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పామర్రు మండలం బలిపర్రు ఆయన స్వగ్రామం. కుటుంబ సభ్యులతో కలిసి తరచూ స్వగ్రామం వస్తుంటారు చలపతిరావు. అలాగే బలిపర్రు అభివృద్ధికి జరిగే కార్యక్రమాల్లో ఆయన తరచూ పాల్గొంటుంటారు. ఇక ఓకే మండలానికి చెందిన వారు కావడంతో ఎన్టీఆర్ తో, చలపతిరావుకు మంచి అనుబంధం ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..