
తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ కారు రేసింగ్‌లో పాల్గొంటూ ఇటీవల పలు ప్రమాదాలకు గురయ్యారు.అజిత్ కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయట పడ్డారని సమాచారం. కాగా ఈ ప్రమాదంలో అజిత్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. 2025 ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఆయన క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి ఇతర కార్లే కారణమని తెలిపింది.
ఇదే సంవత్సరం జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత కూడా ఆయన టీమ్ రేస్‌లో విజయం సాధించింది. అంతకుముందు, 2025 ఫిబ్రవరి 10న పోర్చుగల్‌లో జరిగిన కారు రేస్ పోటీల కోసం శిక్షణలో ఉండగా అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, మెకానిక్ బృందం దాన్ని సరిచేసింది. అజిత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా వెల్లడించారు.
అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా రూ.200కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పుడు అజిత్ కారు ప్రమాదానికి గురవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయనకు గాయాలు కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.