Fish Venkat: ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ సాయం.. అసలు నిజం చెప్పిన వెంకట్ భార్య..
సినీ నటుడు ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోడుప్పల్ లోని ఆర్చీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు కుటుంబసభ్యులు. ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ కావడంతో.. గత నాలుగేళ్లుగా డయాలసిస్ పైనే జీవిస్తున్నట్లు ఆయన కూతురు స్రవంతి తెలిపారు.
సినీనటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను బోడుప్పల్ లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పాడయ్యాయని.. దీంతో కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉందని.. ఆపరేషన్ చేయాలంటే రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో దాతలు ఎవరైనా తమకు సాయం చేయాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వెంకట్ కుటుంబసబ్యులు. ఇప్పటికే పలుమార్లు సాయం కోరినప్పటికీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన కొందరు సహనటులు మాత్రమే స్పందించారని.. అంతకు మించిన రెస్పాన్స్ ఏం రాలేదని అన్నారు.
అయితే ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ రూ.50 లక్షలు సాయం ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆపరేషన్ కు కావాల్సిన సాయం అందిస్తామని ప్రభాస్ టీం నుంచి కాల్ చేసినట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ఫిష్ వెంకట్ భార్య స్పందించారు. ప్రభాస్ హెల్ప్ చేశారని వస్తున్న సోషల్ మీడియా వార్తలు పూర్తిగా అబద్దం అని అన్నారు. కేవలం మోపిదేవి వెంకటరమణ మాత్రం ఒక లక్ష రూపాయలు ఇచ్చారని అన్నారు.