
అందం.. అభినయంతో వెండితెరపై మయ చేసిన అంతలోనే కనుమరుగైన హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. చిన్నవయసులోనే కథానాయికగా చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్ హోదా.. 18 ఏళ్లకే ప్రియుడితో పెళ్లి.. ఏడాదిలోపే ఊహించని రీతిలో మరణం. ఇప్పటికీ ఆమె మృతిపై అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో. ఆమె మరణం తెలుగు చిత్రపరిశ్రమలో తీరని విషాదం నింపింది. కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలోకి నెట్టింది. ఊహ తెలియని వయసులోనే స్టార్‌డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. వెరసి, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిందామె. నేలపై నడిచినప్పుడే ఆమెను స్టార్ అన్నారంతా.. నింగికెగిశాక అనకుండా ఉండగలరా..? కానీ, ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్లిపోయింది టీనేజ్ స్టార్ దివ్యభారతి. ఈ రోజు ఆ అందాల రాణి జయంతి.
1974 ఫిబ్రవరి 24న జన్మించింది దివ్య భారతి. హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనుకోకుండా 16 ఏళ్లకో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమాతో కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమెకు దక్షిణాదిలో ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు, తమిళ భాషల్లో హిట్ చిత్రాల్లో నటించి.. 1992లో విశ్వాత్మ అనే చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఓ దశలో దివ్యభారతి ఎంత బిజీగా ఉందంటే.. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది.
అయితే తెలిసి తెలియని వయసులోనే ప్రేమకు ఆకర్షితురాలై.. అప్పటివరకు తనకు ఉన్న స్టార్ డమ్.. తల్లిదండ్రులను ప్రేమను మరచి.. ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలాతో కొన్నాళ్లు ప్రేమలో ఉన్న దివ్య భారతి మే 10 న 1992లో రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం గురించి నాలుగు నెలల వరకు తండ్రికి చెప్పలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యభారతి తల్లి ఆమె గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఆమె సాజిద్‌ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని తనతో చెప్పిందని.. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పాలని కోరగా.. అందుకు దివ్యభారతి భయపడిందని చెప్పారు. ఆ తర్వాత కూతురి ప్రేమ విషయం తెలియడంతో పెళ్లికి నిరాకరించారట దివ్య భారతి తండ్రి. దీంతో తండ్రికి తెలియకుండానే స్నేహితుల సమక్షంలో సాజిద్ ను వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత కొద్ది రోజులు తల్లిదండ్రులతోనే ఉన్న దివ్యభారతి.. నాలుగు నెలల తర్వాత దీపావళి సందర్భంగా సాజిద్.. దివ్యభారతి ఇంటికి వచ్చి ఆమె తండ్రికి నిజం చెప్పాడు. దీంతో అతను తనకు కాస్త సమయం కావాలని.. అప్పుడు అధికారికంగా ప్రకటిస్తానని అన్నారట. కానీ పెళ్లి జరిగిన సంవత్సరానికే అంటే ఏప్రిల్ 5, 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఇప్పటికీ ఆమె మృతికి గల సరైన కారణాలు లేవని.. ఆమె మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయని అంటుంటారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.