సినిమాలతో పాటు టీవీషోల్లోనూ సందడి చేస్తోన్న పూర్ణ (షమ్మా కాసిమ్) రహస్యంగా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితమే దుబాయ్ వేదికగా షానిద్ ఆసిఫ్ అలీ అనే ఓ వ్యాపారవేత్తతో ఆమె ఏడడుగులు వేసింది. కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే తమ పెళ్లి వేడుక జరిగినట్లు తాజాగా చెప్పుకొచ్చిందీ అందాల తార. ప్రస్తుతం దుబాయ్ లోనే ఉంటోన్న ఈ జంట.. ‘మా నిశ్చితార్థం ఈ ఏడాది మేలో జరిగింది. జూన్ 12న దుబాయ్ వేదికగా మేం పెళ్లిపీటలెక్కాం. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మా వివాహం జరిగింది. వీసా సమస్యల కారణంగా చాలామంది మా పెళ్లి వేడుకకు హాజరుకాలేకపోయారు. అందుకే త్వరలో కేరళ వేదికగా గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నాం’ అని చెప్పుకొచ్చింది. ఇక దీపావళి సందర్భంగా తన పెళ్లి నాటి ఫొటోలను అభిమానులతో పంచుకుంది పూర్ణ. ముస్లిం సంప్రదాయ ప్రకారం జరిగిన పెళ్లి తంతులో ఒంటి నిండా బంగారంతో ధగధగ మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె వేసుకున్న బంగారం విలువనేది నెట్టింట చర్చనీయాంశమైంది.
కాగా పెళ్లి వేడుకను పురస్కరించుకుని పూర్ణకు ఆమె భర్త భారీగానే కానుకలు ఇచ్చాడట. దాదాపు 1700 గ్రాములు(170 తులాలు) బంగారం పెళ్లి కానుకగా ఇచ్చాడని తెలుస్తోంది. బంగారంతో పాటు ఓ లగ్జరీ విల్లా కూడా తన పేరు మీద బహుమతిగా ఇచ్చాడట. కాగా 2007లో విడుదలైన శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది పూర్ణ. ఆతర్వాత సీమ టపాకాయ్, అవును, అవును2, లడ్డూబాబు, నువ్విలా నేనిలా, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా తదితర సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ఆడియెన్స్ అభిమానం పొందింది. ఇటీవల బాలయ్య నటించిన అఖండ, ఆది సాయికుమార్ తీస్‌మార్‌ఖాన్ సినిమాల్లో కీలక పాత్రలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది. రాబోయే ప్రాజెక్టుల విషయానికొస్తే.. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తోన్న దసరా సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది పూర్ణ. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా కనిపించనుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. అలాగే వ్రితం అనే మళయాల సినిమాలోనూ నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..