పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా హనుమాన్. ఎలాంటి అంచనాలు లేకుండానే సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని రేంజ్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో టాప్ హీరోల సినిమాలతో పోటీపడి మరీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రిలీజ్ అయి నెలరోజులు దాటిని ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా రన్ అవుతుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల కాలంలో దాదాపు 150 థియేటర్లలో యాభై రోజులు ఆడిన సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ మూవీ 50 రోజుల వేడుకను మరింత స్పెషల్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సెలబ్రేషన్లలో పాల్గొన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..పార్ట్ 2 జై హనుమాన్ అప్డేట్ పంచుకున్నారు. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ అప్డేట్ రాబోతుందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని వెల్లడించారు.
హనుమాన్ 50 రోజుల ఈవెంట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “ప్రస్తుత కాలంలో ఒక సినిమా వారం రోజులు ఆడటమే గొప్పగా మారింది. అలాంటిది ఇప్పటికీ మా సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. 150 థియేటర్లలో 50 రోజులు ఆడడం అంటే చిన్న విషయం కాదు. మాకు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. సినిమా సక్సెస్ అయ్యిందని.. ఏ రేంజ్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అలాంటప్పుడు మళ్లీ ఓ రూ. 20 లక్షలు పెట్టి ఇలా ఈవెంట్ చేయడం అవసరమా ? అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సినిమా సక్సెస్ అయినా కాకపోయినా సక్సెస్ మీట్స్ పెడుతున్నారు.
నా సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది. విమర్శకుల ప్రశంసలతోపాటు కమర్షియల్ హిట్ అయ్యింది. సక్సెస్ మీట్ అవసరం లేదనుకున్నాం. కానీ సరైన కంటెంట్ తో సినిమా తీస్తే ఇప్పుడు కూడా యాభై రోజులు.. వంద రోజులు సినిమా ఆడతాయనే ఓ నమ్మకం కొత్త వాళ్లకి కలిగేంచేందుకు ఈ ఈవెంట్ పెట్టాం. 20 ఏళ్లలో చేయాలనుకున్నదంతా ఈ ఐదేళ్లలోనే పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాం. త్వరలోనే అన్ని దేశాల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తాం. జై హనుమాన్ పనులు స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాము.” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.