Tollywood: రామ్ చరణ్ అభిమానులు మృతి.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన నిర్మాత దిల్ రాజు
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణించిన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఆ ఫ్యామిలీలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రెస్ మీట్‌లో ఆయన మరిన్ని విషయాలు గురించి విపులంగా మాట్లాడారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి.
శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్‌రాజు మీడియా సమక్షంలో వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’’ అని అన్నారు.
ఇక రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు దిల్ రాజు. ఈవెంట్ గ్రాండ్‌గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని కొనియాడారు. సంక్రాంతికి విడుదల అవ్వనున్న చిత్రాలకు టికెట్ ధరలు సవరించి, బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత తన సినీ కెరీర్‌లో కూడా ఎత్తుపల్లాలు చూసినట్లు చెప్పారు. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో మనగలగలేమని వెల్లడించారు. గేమ్ ఛేంజర్‌ను పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నట్లు చెప్పారు.
కాగా దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి