
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. మొదట సైడ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. స్క్రీన్ రైటర్ గా, మ్యూజిక్ కంపోజర్ గానూ సత్తా చాటాడు. వీటన్నిటికంటే ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన 32 ఏళ్ల సినిమా కెరీర్ లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ ను తెరకెక్కించి దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా నిలిచాడు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో ఇతను పుట్టాడు. భీమవరంలో పీజీ పూర్తి చేశాడు. చాలా మంది లాగే సినిమాలపై మక్కువతో మద్రాస్, హైదరాబాద్ నగరాలు చుట్టేశాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ స్వీట్ షాప్ కూడా నడిపాడు. అందులో లడ్డూలు, కాజాలు తదితర స్వీట్లను స్వయంగా తనే తయారు చేసి విక్రయించాడు. అలా వచ్చిన డబ్బులతోనే సినిమా ఆడిషన్స్ కు హాజరయ్యాడు. మొదట కొన్ని సినిమాల్లో చిన్న చితకా పాత్రలు పోషించాడు. సహాయక నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు.
కానీ ఎందుకో సక్సెస్ అవ్వలేకపోయాడు. దీంతో తనే మెగా ఫోన్ పట్టుకున్నాడు. కెమెరా ముందు నుంచి కాకుండా కెమెరా వెనక్కు వెళ్లి యాక్షన్ కట్ చెప్పాడు. డైరెక్టర్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. అలీ లాంటి కమెడియన్ ను కూడా హీరోగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఘనత ఈ టాలీవుడ్ డైరెక్టర్ సొంతం. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? . యస్. ఇందులో ఉన్నది మరెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి.
కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి కిరాతకుడు సినిమాలో క్యామియో రోల్ లో కనిపించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. అలాగే ‘పగడాల పడవ’ అనే సినిమాలో హీరోగానూ యాక్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత డైరెక్టర్ గా మారి కొబ్బరి బొండం మొదలుకొని, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, శుభలగ్నం, ఆహ్వానం, మావి చిగురు, యమలీల, నెంబర్ వన్, వినోదం, ఎగిరేపావురమా, ఆహ్వానం, ఉగాది, ఊయల, ప్రేమకు వేళాయెరా, పెళ్లి పీటలు తదితర సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు కృష్ణారెడ్డి. మధ్యలో ఉగాది, అభిషేకం తదితర సినిమాల్లో మళ్లీ హీరోగానూ నటించి మెప్పించాడు. నితిన్ నటించిన సంబరం సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్ లో సందడి చేశారు.
చివరిగా ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు సినిమాతో మన ముందుకు వచ్చారు ఎస్వీ కృష్ణారెడ్డి. ప్రస్తుతం వేద వ్యాస్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారీ సీనియర్ డైరెక్టర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.