
పదో తరగతికే చదువు మానేశాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. పొట్ట కూటి కోసం ఈ మహా నగరంలో ఎన్నో రకాల పనులు చేశాడు. ఓ వైపు నాటకాల్లో నటిస్తూనే కూలీ పనులు కూడా చేశాడు. అలా హైదరాబాద్ లో ఎందరో సినీ ప్రముఖుల ఇంటి నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ముఖ్యంగా చిరంజీవి కొత్త ఇంటికి .. అల్లు అరవింద్ గారి ఇంటికి అలాగే టాలీవుడ్ ఐకాన్ స్టార్ ఇళ్ల నిర్మాణంలోనూ కూలీగా పని చేశాడు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ భవన నిర్మాణానికి కూడా వర్క్ చేశాడు. అలాగే దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటి నిర్మాణంలో కూడా ఓ కూలీగా భాగమయ్యాడు. అయితే ఎంత కష్టమొచ్చినా తన మనసులోని నటనాభిరుచిని వదిలేసుకోలేకపోయాడు. నాటికలు, నాటకాలు, స్టేజ్ షోలు చేస్తూనే యాక్టింగ్ లో శిక్షణ తీసున్నాడు. తన ట్యాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. విలన్ గా, సహాయక నటుడిగా ఇప్పటివరకు సుమారు 40 సినిమాలు చేశాడు. శర్వానంద్ కో అంటే కోటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడీ నటుడు. ఆ తర్వాత ప్రతినిధి, నగరం నిద్రపోతున్న వేళ, శమంతక మణి, వంగవీటి, రాధ, ఘాజీ, మనమంతా, ఆర్ ఎక్స్ 100, జార్జ్ రెడ్డి, పలాస, జాంబిరెడ్డి, భీమ్లా నాయక్, మంగళవారం, తంత్ర, సరిపోదా శనివారం.. ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించిన ఈ హీరో ఇటీవలే కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ లోనూ తళుక్కుమన్నాడు.
ఇంతకీ ఇళ్ల నిర్మాణంలో కూలీగా పని చేసి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ నటుడిగా మారింది ఎవరనుకుంటున్నారా? లక్ష్మణ్ మీసాల. ఈ పేరు చెబితే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ పాయల్ రాజ్ పుత్ నటించిన మంగళవారం సినిమాలో చూపు సరిగ్గా లేని వ్యక్తి అంటే ఇట్టే గుర్తు పడతాడు. ఈ సినిమాలో లక్ష్మణ్ నటనను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ మధ్యన ఓ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అతను తన వ్యక్తిగత జీవితం గురించి ఇలా చెప్పుకొచ్చాడు.
‘పర్లాకిమిడి దగ్గర రాయనిపేట మాది. చదువు ఒంటపట్టలేదు. మెడికల్ షాపులో కొంతకాలం పనిచేశాను. ఏం చేయాలనే ఆలోచన లేకుండానే హైదరాబాద్ వచ్చేశాను. పొట్ట కూటి కోసం బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించిన కూలి పనులు చేశాను. అలా చిరంజీవి గారి కొత్త ఇంటికి .. అల్లు అరవింద్ గారి ఇంటికి .. బన్నీగారి ఇంటికి సంబంధించిన కూలి పనులు కూడా చేశాను. ఇదే సమయంలో దీక్షితులుగారి దగ్గర నటన నేర్చుకున్నాను. ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి కారకులు ఆయనే’ అని చెబుతున్నాడు లక్ష్మణ్ మీసాల.
.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.