
సుమారు 750కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించిన కోట శ్రీనివాస రావు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం (జులై 13) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విన్న టాలీవుడ్ తల్లడిల్లిపోయింది. కోట శ్రీనివాసరావును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే సినీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కోటాకు నివాళులు అర్పిస్తున్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. కాగా కోటా శ్రీనివాసరావు సినిమాల విషయానికి వస్తే.. ఆయన 750కు పైగా సినిమాల్లో నటించారు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలసి పని చేశారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా ఎన్నో రకాల పాత్రలకు కోటా ప్రాణం పోశారు. మరి ఈ తరహం జనరేషన్ నటుల్లో కోటాకు బాగా నచ్చిన హీరోలు ముగ్గురు ఉన్నారు.ఇదే విషయంపై ఒక సందర్భంలో మాట్లాడిన కోటా ఈ జనరేషన్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తనకు ఇష్టమైన నటులని చెప్పుకొచ్చారు.’ ఎటువంటి పాత్రనైనా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తాడు. ఆయన డైలాగులు చెబుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్, యాక్షన్ అంటే చాలా ఇష్టం. అలాగే మహేష్ బాబు చాలా అందగాడు. ఎంత మంది హీరోలు వచ్చినా ఆయనలా ఎవరూ ఉండలేరు’ అని కోటా చెప్పుకొచ్చారు.
ఇక డైరెక్టర్ల విషయానికి వస్తే.. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో సుమారు 35 కు పైగా సినిమాల్లో నటించారు కోటా. అలాగే రాఘవేంద్ర రావు, బాపు తదితర దిగ్గజ దర్శకులతోనూ ఆయన పని చేశారు. అయితే ఈ జనరేషన్ లో కోటాకు ఇద్దరు డైరెక్టర్లు బాగా నచ్చారు. వారెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
‘రాజమౌళి ఈ జనరేషన్ లో నెంబర్ 1 దర్శకుడు. అందులో సందేహం లేదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కంటే గొప్ప రచయిత అని చెప్పాలి. జంధ్యాల, ఆత్రేయ, శ్రీశ్రీ ఈ ముగ్గురూ కలిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు కోటా.
రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఛత్రపతి తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు కోట శ్రీనివాస రావు . ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, అత్తారింటికి దారేది, జులాయి లాంటి చిత్రాల్లో కోట నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..