Superstar Krishna: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ మృతి.. ప్రముఖుల సంతాపం..

|

Nov 15, 2022 | 9:00 AM

Superstar Krishna passed away: ఒకనాటి యువతుల కలల చెలికాడు. యువతరం మదిని మీటిన మొనగాడు.. ప్రజాస్వామ్య విలువలతో వెండితెరను ప్రభావితం చేసిన నటరాజు సూపర్‌ స్టార్‌ కృష్ణ యావత్‌ తెలుగు ప్రేక్షక లోకాన్ని..

Superstar Krishna: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ మృతి.. ప్రముఖుల సంతాపం..
Superstar Krishna
Follow us on

ఒకనాటి యువతుల కలల చెలికాడు. యువతరం మదిని మీటిన మొనగాడు.. ప్రజాస్వామ్య విలువలతో వెండితెరను ప్రభావితం చేసిన నటరాజు సూపర్‌ స్టార్‌ కృష్ణ యావత్‌ తెలుగు ప్రేక్షక లోకాన్ని దుఃఖసాగరంలో ముంచి దివికేగి ఆకసంలో తారగా నిలిచాడు. కార్డియాక్‌ ఆరెస్ట్‌తో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తెలుగు తెరను సుదీర్ఘకాలం శాసించిన సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ, తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది. కృష్ణ మృతిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. సూపర్‌స్టార్ మృతిపై నటి, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా శెల్వమణి సంతాపం ప్రకటించారు. ‘‘మహేష్ బాబుకి దేవుడు గుండె నిబ్బరం ఇవ్వాలి.. కొన్ని నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత విషాదకరం.. కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలి.’’ అని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందించారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి 5 దశాబ్ధాల పాటు కృష్ణ అందించిన సేవలను స్మరించుకున్నారు సీఎం కేసీఆర్. 350 కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘీక చిత్రాల నటుడు గా కృష్ణ జనాదరణ పొందారని కీర్తించారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. కృష్ణ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం జగన్. ఏపీ గవర్నర్ హరిచందన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు కూడా కృష్ణ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ మృతికి తెలంగాణ టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు ప్రగాఢ సంతాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆదర్శాన్ని ఆచరిరంచి చూపిన వ్యక్తి కృష్ణ అంటూ కీర్తించారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని, ఆయన కుటుంబ సభ్యులకు, కృష్ణ అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు టీడీపీ నేతలు.

సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ స్పందించారు. కళామతల్లికి అంకితుడైన ఘట్టమనేని కృష్ణ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని నారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. కృష్ణ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అల్లూరి సీతారామరాజు ప్రతిబింబం కృష్ణ అని, అలాంటి కృష్ణ లేరనే వార్త తనను తీవ్రంగా బాధించిందన్నారు నారాయణ.

వీరితో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. సినిమా రంగంలో నేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. హైదరబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సూపర్ స్టార్ కృష్ణ ఎంతో కృషి చేశారని చెప్పారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు రేవంత్ రెడ్డి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..