
షణ్ముఖ్ జస్వంత్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదట షార్ట్ ఫిలింస్ కెరీర్ ప్రారంభించాడు. యూట్యూబ్ సెన్సేషన్ గా మారాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకానొక దశలో తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షన్నూ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఈ షోలో అతను రన్నరప్ గా నిలిచినా విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొన్నాడు. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న షన్నూ సిరి హన్మంతుతో ప్రవర్తించిన తీరు చాలా మందికి వెగటు పుట్టించింది. ఈ కారణంగానే దీప్తి కూడా షన్నూకు దూరమైంది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నాడు షణ్ముఖ్. డ్రంకెన్ డ్రైవ్ లో దొరకడంతో పాటు డ్రగ్స్ ఆరోపణలు కూడా షన్నూపై వచ్చాయి. ఈ వివాదాలు అతని ప్రొఫెషనల్ కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైపోయాడు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ వెబ్ సిరీస్ లు , టీవీషోలు చేస్తున్నాడు. తాజాగా, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గుడ్ న్యూస్ చెప్పాడు షణ్ముఖ్. సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలిని పరిచయం చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసిన షన్నూ.. ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతేకాదు ఇది దేవుడు నిర్ణయించిన బంధం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
షన్నూ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చాలా మంది అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు.? అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా అమ్మాయి ముఖం కనిపించకుండా కవర్ చేశాడు షన్నూ. దీంతో షణ్ముఖ్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? అని ఆరా తీసే పనిలో పడ్డారు. మరి నెటిజన్ల ప్రశ్నలపై షణ్ముఖ్ ఎప్పుడు సమాధానమిస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.