MAA Elections 2021: టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. ఒక్కొక్కరిగా నామినేషన్లు వేస్తున్నారు. మొదటి నుంచి ఎన్నికల కోసం ఆరాటపడతూ వచ్చిన ప్రకాష్ రాజ్ టీమ్ నామినేషన్స్ దాఖలు చేసింది. నటుడు సీవీఎల్ కూడా నామినేషన్ వేశారు. తాజాగా నటుడు బండ్ల గణేశ్ జనరల్ సెక్రెటరీగా నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహానుభావులు 28 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ పెట్టారని ఇప్పటివరకు ప్రతి అధ్యక్షుడు బాగానే పని చేశారని కొనియాడారు. గత ప్రెసిడెంట్‌ని అన్యాయంగా దింపే ప్రయత్నం చేశారని, తాజాగా ఇప్పుడు కొంతమంది వచ్చి సభ్యులను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. మన హీరోలందరిని తీసుకొచ్చి ప్రోగ్రామ్ పెట్టి ఫండ్ కలెక్ట్ చేసి100మంది సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామి ఇచ్చారు. తాను మా బిల్డింగ్ కట్టనని, ఇప్పుడున్న ఆఫీస్ సరిపోతుందని పేర్కొన్నారు.
మా బిల్డింగ్ కడతాను, చార్మినార్ కడతాను, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతున్నారని, కానీ అవేమి జరిగే పనులు కావని అన్ని అబద్ధాలని విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మా ఎలక్షన్ తరువాత మాట్లాడతానన్నారు. ప్రజల్ని ఎంటర్ టైన్ చేసే మన ఆర్టిస్టులు ఉండగా ఎవరినో ఫండ్ అడగడం ఏంటని ప్రశ్నించారు. తన విజయాన్ని ఎవరు ఆపలేరని, తనకు ఆ పరమేశ్వరుడి సపోర్ట్ ఉందని సభ్యులందరూ మిగతా వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకొని ఓటు మాత్రం తనకే వేయాలని సభ్యులను కోరారు.