B Vittalacharya: ఆయన సినీ మాయ మాంత్రికుడు-మంత్ర నగరికి మహారాజు

B Vittalacharya: ఆయన మంత్ర నగరికి మహారాజు. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు. నిరంతర శ్రామికుడు. నిత్యాన్వేషి. జానపదాలపై ఆయనది గుత్తాధిపత్యం.

B Vittalacharya: ఆయన సినీ మాయ మాంత్రికుడు-మంత్ర నగరికి మహారాజు
Vittalacharya (4)
Follow us

| Edited By: Phani CH

Updated on: Jan 27, 2022 | 5:30 PM

B Vittalacharya: ఆయన మంత్ర నగరికి మహారాజు. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు. నిరంతర శ్రామికుడు. నిత్యాన్వేషి. జానపదాలపై ఆయనది గుత్తాధిపత్యం. మాయా ఛాయగ్రహణంతో ప్రేక్షకులను కొత్త బంగారులోకాల్లో విహరింప చేసిన ఘనుడు. వెండితెరపై ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. ఆయన జానపద బ్రహ్మ. మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు. ఆయనే ఉడిపి విఠలాచార్య. టక్కు-టమార-గజకర్ణ-గోకర్ణ-ఇంద్రజాల-మహేంద్రజాల విద్యలను సగటు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసింది విఠలాచార్యే. మంత్ర తంత్రాలతో రెండున్నర గంటల పాటు హాయిగొలిపే వినోదాన్ని అందించారు. తర్క వితర్కాలతో పని వుండదు. సినిమా వినోదం కోసమేనని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన సినిమాలన్నీ జనరంజకాలయ్యాయి. జనవరి 28 ఆయన జయంతి..ఆ సినీ మాయ మాంత్రికుడి గురించి ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కాబట్టి ఆయన గొప్పదనం గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.

వినోదం కోసమే సినిమా పుట్టింది. పుట్టాక కాసింత విజ్ఞానాన్ని జోడించుకుంది. అప్పుడప్పుడు సందేశాలనూ ఇచ్చింది. కొండొకచో సామాజిక బాధ్యతనూ తీసుకుంది. ఇన్ని డైమన్షన్‌లున్నా. సినిమా అంటే వినోదమే. ఇంకో నిర్వచనాన్ని ఇవ్వడం కుదరదు. అలాగని సినిమాల్లో కళ లేదని కాదు. కాకపోతే అది వ్యాపారానికి పనికివచ్చే కళ. లక్షలు కుమ్మరించి తీస్తున్నారు కాబట్టి సినిమా కళలో వ్యాపారానికి సరిపోయే లక్షణాలుండాలి. ఈ సూత్రాన్ని విఠలాచార్య బాగా వంటపట్టించుకున్నాడు. సినిమాలు తీసేదే జనం కోసమని చెప్పుకునే ఆయన జనం కోరే సినిమాలే తీశాడు. కనుమూసే వరకు ఈ సిద్ధాంతానికే కట్టుబడి వున్నాడు. ఇది ఆయనకు జీవితం నేర్పిన పాఠం. విఠలాచార్య సినిమాలేం కళాత్మకమైనవి కావు.. సందేశాత్మకాలు అంతకన్నా కావు. కలకాలం నిలిచిపోయే దృశ్యకావ్యాలు అసలే కావు.. కానీ రెండున్నర గంటలపాటు నమ్మకంగా ఆనందపరుస్తాయి. ప్రేక్షకులు మురిసిపోయేటట్టు చేస్తాయి. మంత్రనగరిలో షికారు కొట్టిస్తాయి.

సాంకేతిక పరిజ్ఞానాలు .గ్రాఫిక్స్‌ హంగులు. ఇవేమీ లేని కాలంలోనే సంభ్రమాశ్చర్యాలు కలిగించే చిత్రాలు తీశాడు విఠలాచార్య. అత్యాధునికమైన కెమెరాలు. బ్లూమాట్‌ విన్యాసాలు. కంప్యూటర్లు. మాయా టెక్నాలజీలు. మల్టీ మీడియాలు. ఇన్నున్నా.. ఇప్పుడాయన సినిమాలు తీయడం అసాధ్యం..తీసినా ప్రేక్షకులను మెప్పించడం అనితర సాధ్యం. మళ్లీ తీసిన జగన్మోహిని కంటే ఉత్తమమైన ఉదాహరణ అవసరం లేదు. విఠలాచార్య సినిమాలేమిటి..? హంబక్‌. ఓ కళుండదు. పాడుండదు అనుకునే వాళ్లు చాలా మందే వుంటారు. ఆయన మొహం మీద అన్నవాళ్లూ వున్నారు. వాళ్లను చూసి చిద్విలాసంగా నవ్వుకున్నాడే కానీ ఏనాడూ మండిపడలేదు. ఆ మాటకొస్తే కళకు నిర్వచనమంటూ వుందా? ఏం పాటలు. డాన్సులు. మంత్రాలు. తంత్రాలు. యుద్ధాలు ఇవి కళలు కావా ఏమిటీ? సినిమా అంటేనే అన్‌నాచురల్‌ థింగ్. బయట మనమెప్పుడైనా డ్యూయెట్లు పాడుకుంటామా? పాడుకోము కదా! అంచేత జనాలు కోరుకునే సకల కళలు నా సినిమాల్లో వుంటాయి అంటూ వినయంగా జవాబిచ్చేవాడు విఠలాచార్య.

Vittalacharya (1)

పెద్దల కోసం పిల్లల సినిమాలు తీయడంలో ఆయన కొట్టిన పిండి. ఆయన సినిమాల్లో హీరోలు కొండలనైనా పిండి చేస్తారు. నువ్వులు పిండి నూనె తీస్తారు. సప్తసముద్రాలు అవలీలగా దాటేస్తారు. బ్రహ్మరాక్షసుల భరతం పడతారు. చిలకలో దాగివున్న మాంత్రికుడి ప్రాణాలు తీస్తారు. తెర ముందు హీరో ఎన్ని వేషాలేసినా. తెరవెనుక కథనాయకుడు మాత్రం విఠలాచార్యే. సనాతన బ్రాహ్మణ కుటంబం నుంచి వచ్చిన కన్నడిగుడు విఠలాచార్య. ఉడిపి దగ్గరున్న బెల్లిలో 1920, జనవరి 28న పుట్టాడు. సొంతవూరే ఆయన ఇంటిపేరైంది. ఆ ఊరి బళ్లోనే చదువు సంధ్య నేర్చుకున్నాడు. అక్కడ ఆపేశాడు కూడా. కారణం చదువు మీద ఆసక్తి లేకపోవడం కాదు. దానికంటే కథలు కాకరకాయంటే ఎక్కవ ఇష్టం అవ్వడంతో! చరిత్ర అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇక జానపదాలైతే చెప్పేకన్కర్లేదు. అసలు ఆయన మార్క్‌ సినిమాలకు అంకురం పడింది అప్పడే! ఆ లేత వయసులోనే! చదువబ్బలేదు కానీ జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల మాత్రం చాలా వుండేది. నిజానికి విఠలాచార్య కుటుంబానికి హోటల్‌ బిజినెస్‌ వుండేది. అన్న కూడా అదే చేస్తున్నాడు. బెల్లికి ఓ 150 కిలో మీటర్ల దూరంలో వున్న అరిసికరైలో వున్న ఆయన దగ్గరకి వెళ్లాలనుకున్నాడు. అందరిలా బండిలో వెళితే విఠలాచార్య ఎందుకవుతాడు. జానపద కథల్లో రాకుమారుడిలా తుండుగుడ్డలో కాసిన్ని రొట్టెలు కట్టుకుని కాలినడకన బయలుదేరాడు. అప్పుడాయన వయసు కేవలం తొమ్మిదేళ్లే! అరిసికరైలో ఓ కొండ వుంది. ఆ కొండపై వేంకటేశ్వరస్వామి ఆలయముంది. దాన్ని మాలెకల్లు తిరుపతి అంటారు. అక్కడ్నుంచి తిరుపతికి సొరంగమార్గం వుందని చెబుతారు. విఠలాచార్య ఊళ్లోకి చేరగానే స్వామి దర్శనం చేసుకున్నాడు. తుండుగుడ్డతో ఈ ఊరొచ్చాను. కష్టపడి పని చేస్తాను.. సంపదనిస్తావో.. ఇలాగే వుంచుతావో నీ ఇష్టం అంటూ వేడుకున్నాడు. స్వామివారి ఆశీస్సులు లభించాయో ఏమో కానీ.. అన్నదమ్మలిద్దరికీ వ్యాపారం బాగా కలిసివచ్చింది. డబ్బు గడించాక విఠలాచార్య కొండమీద గుడిలో కళ్యాణమంటపం కట్టించాడు. రహదారివెంట కరెంట్‌ ఖర్చులను జీవితాంతం భరించాడు. ఆ ఊళ్లో వుంటూనే నాటకాల్ల వేషాలు వేశాడు. కత్తిసాము, కుస్తీ నేర్చుకున్నాడు. కుస్తీ పోటీల్లో బహుమతులు కూడా గెల్చుకున్నాడు. గాంధీ మహాత్ముడిచ్చిన పిలుపుతో జాతీయోద్యమంలో పాలుపంచుకున్నాడు. అప్పుడాయన వయసు పద్దెనిమిదేళ్లు. ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. ఎందుకో రాజకీయాల్లో ఇమడలేకపోయాడు. మళ్లీ 1943లో వ్యాపారంలో దిగాడు. మిత్రులతో కలిసి టూరింగ్‌ టాకీసులు నడిపించాడు. కొన్నాళ్లయ్యాక మహాత్మా పిక్చర్సు బ్యానర్‌ను స్టార్ట్‌ చేసి శ్రీనివాస కళ్యాణం, సౌభాగ్య లక్ష్మీ వంటి కొన్ని సినిమాలు తీశాడు. అన్నింటికీ ఆయనే నిర్మాత. కొన్నింటిలో వేషాలూ వేశాడు. అయితే తెలుగు, తమిళ సినిమాల తాకిడికి ఇవి తట్టుకుని నిలబడలేకపోయాయి. భారీగా నష్టాలను తెచ్చిపెట్టాయి.

ఇక లాభం లేదనుకుని తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పుడే విఠల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ప్రారంభమైంది. ఇక్కడికి రాగానే ఆయన చేసిన మొదటి పని తెలుగు నేర్చుకోవడం. కొద్ది రోజులకే భాష మీద పట్టు సాధించాడు. తెలుగులో ఆయన తీసిన మొదటి రెండు సినిమాలు కన్యాదానం, వద్దంటే పెళ్లి ఫట్‌ మన్నాయి. ఇక లాభం లేదనుకుని జయవిజయ అనే జానపదం తీశాడు. అది బాగా పోవడంతో జనం నాడి విఠలాచార్యకు అర్థమైంది. ఏమో జనం సోషల్‌ మెలోడ్రామా వున్న సినిమాలు కూడా చూస్తారేమో అన్న అనుమానంతో మధ్యలో అన్నాచెల్లెలు, పెళ్లి మీద పెళ్లి అనే సినిమాలు తీశాడు. అవి కూడా దారుణంగా ఫెలయ్యాయి. ఆ తర్వాత బీదలపాట్లు సినిమా వరకు సాంఘికాల జోలికే వెళ్లలేదు.

Vittalacharya (2)

బాల్యంలో చదువుకుని మురిసిపోయిన పేదరాశిపెద్దమ్మ కథలు..చందమామ కథలు.. ఒక్కోసారి అరేబియన్‌ నైట్స్‌ గాధలు అన్నింటినీ ఆయన తెరకెక్కించాడు. కథలో క్యారెక్టర్లవే! నేపథ్యము అదే! కాకపోతే కథనంలోనే కాస్త తేడా వుంటుంది. ఏదో ఒక వైవిధ్యముంటుంది. లేకపోతే అన్నేసి హిట్లు కొట్టేవాడా? విఠల్‌ ప్రొడక్షన్స్‌ కాస్త విఠల్‌ కంబైన్స్‌ అయింది. ఇక అప్పట్నుంచి అన్నీ విఠలాచార్య మార్క్‌ సినిమాలే. ఫక్తు జానపదాలే! చందమామ కథలే! క్రమం తప్పకుండా ఒకదాని వెంట మరోటి సినిమాలు తీస్తూ పోయాడు విఠలాచార్య. ఆయన సినిమాల్లో పాత్రలు పర్మినెంట్‌గా వుండేవి. కాకపోతే కథలోనే మార్పులుండేవి. ఏ సినిమా చూసినా ఓ ముసలిరాజు. రాజ్యాధికారం కోసం కుట్రలు పన్నే మంత్రో సేనానో లేకపోతే రాజుగారి తమ్ముడో. అదీ కాకపోతే రాజుగారి బామ్మర్దో. మధ్యలో ఓ మాంత్రికుడు. రాజకుమారుడు ఓ సామన్య స్త్రీతో ప్రణయం. లేదూ రాజకుమారి ఓ సామన్యుడితో ప్రేమ. ఇవే పాత్రలు. వీటిచుట్టే సినిమా.ఇంటర్వెల్‌ తర్వాత ముసలిరాజుని విలన్‌ బంధించడం.. రాజకుమారుడు ఆయన్ను చెర నుంచి విడిపించడం. రాకుమారితో పెళ్లి చేసుకోవడం. శుభం కార్డు పడటం. ప్రేక్షకుడు మాత్రం ఇదేదో చూసిన సినిమాలాగుందే అని ఎక్కడా ఫీలవ్వడు. కొత్త సినిమా చూస్తున్న అనుభూతినే పొందుతాడు. అది విఠలాచార్య గారడీ. విఠలాచార్యకు విసుగనిపించలేదు. ప్రేక్షకులూ విసుగు చెందలేదు.

ఏ సినిమా అయినా ప్రణాళికాబద్దంగా తీసేవాడు. ఎక్కడా పైసా కూడా వృధా ఖర్చు చేసేవాడు కాదాయన. సినిమా మూహుర్తపు షాట్‌ రోజే రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసే ధైర్యం బహుశా ఆయనకొక్కడికే వుందేమో! స్క్రిప్టు వర్క్‌ పూర్తికాగానే ఆర్టిస్టులందరికీ వారివారి పోర్షన్‌ తాలూకు పేపర్లను పంపించేస్తారు. ఆర్టిస్టులంతా సంభాషణలు కంఠస్తం చేయాల్సిందే! అందుకే ఆయన సినిమాల్లో టేకులెక్కువగా వుండేవి కావు. ఒకవేళ ఏ ఆర్టిస్టైనా డైలాగ్‌ మర్చిపోతే వెంటనే మరో షాట్‌కు వెళ్లిపోయేవాడు. ఎంత వేగంగా సన్నివేశాలను తీసేవారంటే… సాయంత్రానికి అనుకున్న సీన్లన్నీ మధ్యాహ్నమే పూర్తయ్యేటంతగా…అలాగని క్వాలిటీ పట్ల రాజీ పడేవాడు కాదు. ఒక సెట్‌ను బహువిధాలుగా వాడుకోవడమన్నది విఠలాచార్యకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. దాన్నే అటూ ఇటూగా మార్చేవాడు. క్యాస్ట్యూమ్స్‌ కూడా అంతే. ఆయన దగ్గర నటీనటులంతా భయభక్తులతో ఎంతో ఒద్దికతో వుండేవారు. తిక్కవేషాలు వేస్తే సినిమాలో చిలుకగానో, కుక్కగానో, ఎలుగుబంటిగానో మార్చేస్తారన్న భయం. స్వాతంత్ర్యం

విఠలాచార్య సినిమాలో ట్రిక్‌ వర్కు ఎక్కువగా వుండేది. అందుకే ఆయన చేయి తిరిగిన కెమెరామెన్‌ను తీసుకునేవారు. రవికాంత్‌ నగాయిచ్‌, హెచ్‌ఎస్‌ వేణు వంటి ఫోటోగ్రాఫర్లు విఠలాచార్య సినిమాలతోనే పాపులరయ్యారు. అగ్గి పిడుగు సినిమా చూస్తే చాలు. విఠలాచార్య, రవికాంత్‌ కాంబినేషన్ చేసిన జిమ్మిక్కులు. చమక్కులు అర్థమవుతాయి. ఆయన చేసిన ప్రయోగాలు ఇప్పుడు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కాలంతో సంబంధం లేని జానపదాలు కాబట్టి లాజిక్కులు అవరసముండదు. తర్కానికి పనివుండదు. అగ్గి పిడుగులో ఫ్రెంచి వైద్యుడున్నా… కదలడు వదలడులో చైనా సుందరి కనబడినా ఇదేమిటని ప్రేక్షకులు అడగలేదు. ఆయన దయ్యాలతో చెడ్డ పనులు చేయించగలడు. కుటుంబ నియంత్రణ సందేశాలివ్వడం వంటి మంచి పనులు కూడా చేయించగలడు. విఠలాచార్య సినిమాలన్నీ తమిళ, హిందీ భాషల్లో డబ్‌ అయ్యేవి. అక్కడ కూడా కాసులు కురిపించేవి. తమిళంలో అయితే కాంతారావును అక్కడి జనం జూనియర్‌ ఎమ్జీయార్‌ అని పిలుచుకునేవారట! విఠలాచార్య సినిమాలు మనదేశంలోనే కాదు. థాయ్‌లాండ్‌, మలేషియా, సింగపూర్‌, బర్మా, దక్షిణాఫ్రికాల్లో కూడా ఆడేవి.

ఎన్టీయార్‌, విఠలాచార్య కాంబినేషన్‌లో పదహారు సినిమాలొచ్చాయి. సైనికులు చుట్టి ముట్టినప్పుడు ఎన్టీయార్‌ ఒరలోంచి కత్తి తీసి ముద్దు పెట్టుకుని గాల్లో ఓసారి ఝుళిపించగానే ప్రేక్షక జనం ఆనందంతో కేరింతలు కొట్టేవారు. చప్పట్లతో హాలు దద్దరిల్లేది. రామారావును మాస్‌ హీరోగా నిలబెట్టింది…కెరీర్‌ను కాపాడింది ఓ రకంగా విఠలాచార్యే. ఆరిస్టులందరినీ విఠలాచార్య సమానంగా గౌరవించేవాడు. చిన్న ఆర్టిస్టులకైతే ఆయనో దైవం. వాళ్ల అవసరాలన్నీ తీర్చేవాడు. అవసరమనిపిస్తే ఆదుకునేవాడు. తనకు చేసిన చిన్న సాయాన్ని కూడా గుర్తుపెట్టుకునేవాడు. బదులుగా కొండంత సాయాన్ని అందించేవాడు. ఆర్టిస్టులందరినీ గౌరవంగా చూసేవాడు విఠలాచార్య. తొలి రోజుల్లో ఆయన కన్నడ సినిమాలన్నీ మద్రాస్‌లోని వాహినీలో తీశారు. అప్పుడే నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది. నాగిరెడ్డితో తన సాధకబాధకాలన్ని చెప్పుకున్నాడు విఠలాచార్య. కన్నడ సినిమాలకు ఖర్చేక్కువ, రాబడి తక్కువనే విషయాన్ని పాపం నాగిరెడ్డి కూడా గ్రహించి రెంటు తక్కువ తీసుకోవడమే కాదు, ఇతర సదుపాయాలు కూడా కల్పించాడు. అలాగే సుందర్‌లాల్‌ నహతా కూడా విఠలాచార్యను చాలా సందర్భాల్లో ఆదుకున్నాడు. వీరిద్దరి పట్ల చనిపోయేంతవరకు కృతజ్ఞత చూపాడు విఠలాచార్య. తన కన్నడ సినిమాల పరభాష హక్కులన్నీ నాగిరెడ్డికే ఇచ్చారు. గుండమ్మకథ సినిమాకు మాతృక విఠలాచార్య తీసిన కన్నడ సినిమా మనేతుండెద హెణ్ణునే! అలాగే మాయాబజార్‌ సినిమాను చాలా తక్కువ ఖర్చుతో కన్నడలో అనువాదం చేసి నాగిరెడ్డికి ఇచ్చారు. ఆ సినిమా కన్నడ సీమలో స్ర్టయిట్‌ సినిమాలకు మించి వసూళ్లు చేసింది. అలాగే సుందర్‌లాల్‌ నహతాకు ఆయన తీసిపెట్టిన బందిపోటు బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులను నెలకొల్పింది. తనను కలవడానికి వచ్చిన ఏ చిన్న ఆర్టిస్టునైనా పిలిచి స్వయంగా మాట్లాడేవాడు. కాఫీ ఫలహారాలిచ్చి వచ్చిన పనేమిటో కనుక్కునేవారు. సినిమా ఎంతకాలంలో పూర్తవుతుందన్న విషయాన్ని ముందే అంచనా వేసే విఠలాచార్య చిన్న తారలకు పారితోషికాన్ని అన్ని నెలలకు సమానంగా విభజించి జీతం మాదిరిగా ఇచ్చేవాడు. సరిగ్గా అయిదో తారీఖున చెక్కులిచ్చేసేవాడు. ఇందులో ఏ మాత్రం తేడా వుండేది కాదు. అందుకే చిన్న తారలకు విఠలాచార్య ఓ దేవుడు. అలాగని పెద్ద తారలకేం అయిష్టుడు కాదు.. వారు కూడా విఠలాచార్యను ఎంతో గౌరవభావంతో చూసేవారు.

Vittalacharya (3)

నెమ్మదిగా విఠలాచార్య ప్రభ తగ్గడం ప్రారంభమైంది. పట్టణాల వైశాల్యం పెరిగిపోవడం, పల్లె జనం పట్నాలకు వలసపోవడంతో ప్రజల అభిరుచుల్లో మార్పు వచ్చింది. కాల్పనిక ప్రపంచంపై జనాలకు నెమ్మదిగా ఆసక్తి తగ్గడం మొదలైంది. ఆధునీకత చోటు చేసుకున్న నాగరికతపై మోజు పెంచుకోసాగారు. ఇది గ్రహించే విఠలాచార్య రూటు మార్చుకున్నాడు. ఎన్టీయార్‌ హీరోగా నిన్నే పెళ్లాడతా అనే సాంఘిక చిత్రం తీశాడు. జనం పెద్దగా ఆదరించలేదు. అక్కడితో ఆగకుండా పాత యూనిట్‌నంతా పక్కన పెట్టి కొత్త యూనిట్‌తో తన చలనచిత్ర జీవితంలో ఎన్నడూ లేని విధంగా అక్కినేని హీరోగా బీదలపాట్లు తీశాడు. భారీగా ఖర్చు పెట్టాడు. ఇది కూడా అపజయం చెందింది. నాగయ్యను చూసిన జనం నాగేశ్వరరావును చూడలేకపోయారు. మళ్లీ ఎన్టీయార్‌తో పల్లెటూరి చిన్నోడు తీశాడు. ఇది దిలీప్‌కుమార్‌ సినిమా గోపికి ఆధారం. ఇది కూడా పోయింది. దాంతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా వుండిపోయాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ తన పాత ఫార్మలాతోనే జగన్మోహిని తీశాడు. అది సూపర్‌హిట్టయింది. జయమాలినికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు తీశాడు కానీ జగన్మోహినిలా విజయవంతం కాలేకపోయాయి. వయసు పెరగడంతో నెమ్మదిగా సినిమాలకూ దూరమయ్యాడు.

జనపదాలు చెదిరాయి. జానపదాలకు కాలం చెల్లాయి. జనం కోరికలో మార్పు వచ్చింది. వేగం పెరిగింది. దాంతో పాటు బడ్జెటూ పెరిగింది. వాటిని విఠలాచార్య అందుకోలేకపోయాడు. నెమ్మదిగా పరిశ్రమకు దూరమయ్యాడు. సినిమాల్లోని హంగులకు…రంగులకు కుదురుకోలేకపోయాడు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదనే విషయాన్ని విఠలాచార్య ప్రగాఢంగా నమ్మేవాడు. జీవితాంతం పనిలోనే ఆనందాన్ని వెతుక్కున్నాడు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న విఠలాచార్య తర్వాత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్‌ను స్వీకరించలేదు. విఠలాచార్య మొదటి సంస్థ మహాత్మా పిక్చర్స్‌లో దర్శకుడు శంకర్‌సింగ్‌ కూడా పార్ట్‌నర్‌. 1953లో వీరిద్దరు కలిసి తీసిన మొదటి సినిమా జగన్మోహిని. ఇందులో హీరోయిన్‌గా వేసింది శంకర్‌ సింగ్‌ భార్య ప్రతిమాదేవి. వీరి కుమారుడే రాజేంద్రసింగ్‌ బాబు. కన్నడలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకుడు. తెలుగులోనూ నాలుగైదు సినిమాలు ఈయన చేశాడు. అదే జగన్మోహినిని మళ్లీ జయమాలినితో తీస్తే సూపర్‌హిట్టయింది. తమిళంలో డబ్‌ చేస్తే అక్కడా హిట్టే. అందుకే మళ్లీ నమితతో మరోసారి తీశారీ సినిమాను.

విఠలాచార్య పరమ ఆస్తికుడు. దైవం మీద అచంచల విశ్వాసం. జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు. అప్పుల్లో మునిగాక ఓ నాడిమండల జ్యోతిష్కుడి దగ్గరకెళ్లాడట! రుణ విముక్తుడ్ని ఎప్పుడవుతానని, వ్యాపారంలో నష్టాలు కాకుండా వుండేందుకు ఏం చేయాలని అడిగాడట! దానికాయన రెండేళ్లలో అప్పులన్నీ తిరిపోతాయని… లాభాలు రావాలంటే పరభాషా చిత్రాలు తీయాలని చెప్పాడట. ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టుగానే రెండేళ్లలో విఠలాచార్య అప్పులన్నీ తీర్చేశాడు. తెలుగు సినిమాలు తీసి బాగా సంపాదించాడు.. అప్పట్నుంచి జ్యోతిష్యంపై నమ్మకం పెంచుకున్నాడు. ఆ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేశాడు. అశ్వినీ నక్షత్రం… రెండోపాదం.మేషరాశి..మూడోసారి ఏలినాటి శని ప్రవేశించి జనమమశని జరుగుతుండగా విఠలాచార్య అనే నేను కన్నుమూస్తానని డైరీలో స్వయంగా రాసుకున్నాడట. ఆయన రాసుకున్నట్టుగానే 1999లో తన 80వ ఏట కనుమూశాడు. ఇప్పుడొస్తున్న సినిమాలను చూసి ఆహో ఓహో అనుకుంటున్నాం.. గ్రాఫిక్కులకి జేజేలంటున్నాం..ఇవన్నీ ఎప్పుడో విఠలాచార్య తీసేసిన విషయాన్ని మాత్రం విస్మరించాం. నిజంగానే జానపదాలను జనపదాల్లోకి తీసుకెళ్లిన ఆద్యుడు విఠలాచార్యే..చివరివాడు కూడా ఆయనే!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..