Rashmi Gautam: వీధికుక్కల దాడిలో చిన్నారి మృతిపై స్పందించిన రష్మి.. అవీ ప్రాణులేనంటూ పోస్ట్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

|

Feb 22, 2023 | 6:12 PM

అంబర్‌ పేట విషాద ఘటనపై ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. తమ విచారాన్ని వ్యక్తం చేశారు. తాజాగా స్టార్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్ ఈ దుర్ఘటనపై స్పందించింది.

Rashmi Gautam: వీధికుక్కల దాడిలో చిన్నారి మృతిపై స్పందించిన రష్మి.. అవీ ప్రాణులేనంటూ పోస్ట్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌
Rashmi Gautam
Follow us on

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అభం శుభం తెలియని చిన్నారి మూగజీవాల మూకుమ్మడి దాడిలో ప్రాణాలొదలడం అందరినీ కలచివేసింది. పలువురు ప్రముఖులు ఈ విషాద ఘటనపై స్పందిస్తున్నారు. కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందడం అత్యంత బాధాకరమని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ దాడితో జీహెచ్‌ఎంసీ కూడా అప్రమత్తమైంది. కుక్కల దాడుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాగా అంబర్‌ పేట విషాద ఘటనపై ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. తమ విచారాన్ని వ్యక్తం చేశారు. తాజాగా స్టార్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్ ఈ దుర్ఘటనపై స్పందించింది. జబర్దస్త్‌ యాంకర్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రష్మిలో సామాజిక దృక్పథం కూడా ఎక్కువే. ముఖ్యంగా మూగజీవాలపై ఆమెకు మక్కువ ఎక్కువ. కరోనా కాలంలో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించి తన గొప్ప మనసును చాటుకుంది. అంతేకాదు పలు సందర్భాల్లో జంతువుల పట్ల తన ప్రేమను చాటుకుంది. జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వాటి​కి సంబంధించిన ఫొటోలు, వీడియోలనుషేర్‌ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంటుంది.

తాజాగా అంబర్‌పేట ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేసింది రష్మీ. ‘ఈ విషాద ఘటనలో ఆ బాలుడి తప్పేంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల సంతాన ఉత్పత్తి, వ్యాక్సినేషన్, వాటికి సరైన వసతి కల్పించాలి. వాటికంటూ ఓ ప్రత్యేక షెల్టర్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది .ఎందుకంటే అవి కూడా మనలాగే ప్రాణులు’ అని తెలిపింది స్టార్‌ యాంకర్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు రష్మీకి సపోర్టు చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ‘కుక్కలు చిన్న పిల్లాడిని చంపేశాయి మేడమ్‌.. అయినా నీకు మనుషుల కంటే కుక్కలే ఎక్కువైపోయాయా’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..