
సక్సెస్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది అనన్యా పాండే. నెపోటిజం కారణంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో బాగానే వస్తున్నాయి ఈ అమ్మడికి. అన్నట్లు లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఒక సినిమాకే పరిమితమైంది అనన్య. ఏదేమైనా బాలీవుడ్‌లో బిజీగా ఉన్న యువ నటీమణులలో అనన్య ఒకరు. ఇప్పుడామె కొత్త విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. ధన్‌తేరాస్ రోజే కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. తన నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అనన్య పాండే. ‘నా కొత్త ఇల్లు. మీ ప్రేమాభిమానాలు మాపై ఉండాలి. అందరికీ దంతేరాస్ శుభాకాంక్షలు’ అని అనన్య పాండే తన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఇంట్లో పూజ చిత్రంతో పాటు, ఇంటి తలుపు ముందు కొబ్బరికాయ పగులగొట్టే వీడియోను కూడా షేర్ చేసిందీ అందాల తార.
అనన్య పాండే ముంబయిలోని జుహు ప్రాంతానికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ప్లాట్ కోసం అనన్య పాండే ఆరు కోట్లు వెచ్చించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటి మొత్తం వైశాల్యం 3000 చదరపు అడుగులని తెలుస్తోంది. ఈ విలాసవంతమైన ఇంట్లో అనన్య పాండే ఒంటరిగానే ఉంటుందని తెలుస్తోంది. అనన్య తన మొదటి ఇంటిని కొనుగోలు చేయడం పట్ల తల్లి భావనా పాండే, తండ్రి చుంకీ పాండే ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల పలువురు బాలీవుడ్ నటీనటులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. పరిణీతి చోప్రా, కాజోల్, దీపికా పదుకొణె, అలియా భట్, అజయ్ దేవగన్, నటుడు అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా వంటి నటీమణులు ముంబైలో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేశారు. అనన్య పాండే 2019లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో తన సినిమా కెరీర్‌ను ప్రారంభించింది. అనన్య నటించిన ఆరు సినిమాలు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. అందులో తెలుగు లైగర్ కూడా ఒకటి. అనన్య ప్రస్తుతం మూడు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.