
పుష్ప 2 సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతేడా ఇదే రోజు (డిసెంబర్ 05)న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. అయితే ఈ పుష్ప 2 సినిమా మరో రకంగానూ వార్తల్లో నిలిచింది. అదే సంధ్య థియేటర్ తొక్కిసలాట. ఈ సినిమా విడుదల సమయంలోనే థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటన తర్వాత శ్రీ తేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు పుష్ప టీమ్ మొత్తం అండగా నిలిచింది. పిల్లాడి చికిత్సకు అయ్యే ఖర్చంతటినీ తామే భరిస్తామని భరోసా ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలసుకుంటున్నాడు. అలాగే దిల్ రాజు, అల్లు అరవింద్, బన్నీవాసు కూడా పిల్లాడి కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం చేశారు.
కాగా ఈ దుర్ఘటన జరిగి నేటితో ఏడాది పూర్తైంది. ఈ క్రమంలో శ్రీతేజ్ గురించి అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ టీమ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇదే సందర్భంగా చిన్నారి శ్రీ తేజ్ కోసం అల్లు అర్జున్ ఎంత డబ్బు ఖర్చు చేశారనే విషయాలను కూడా వివరాలతో సహా తెలియజేశారు. శ్రీ తేజ్ కోసం అల్లు అర్జున్ ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 20 లక్షల 40 వేల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలియజేశారు. అలాగే శ్రీతేజ్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా సుమారు 1.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాడు. ఇలా చిన్నారి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో బ్యాంక్ నుంచి ఇప్పటివరకు ఫిక్స్ డిపాజిట్ పై సుమారు రూ. 17 లక్షల వరకు వడ్డీ కూడా వచ్చినట్లు తెలియజేశారు. శ్రీ తేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుమారు 76 లక్షల రూపాయల వరకు హాస్పిటల్ బిల్లులు బకాయి ఉండడంతో వాటన్నింటినీ కూడా అల్లు అర్జున్ టీమ్ క్లియర్ చేసిందని తెలిపారు. ఇలా శ్రీ తేజ కోసం అల్లు అర్జున్ సుమారు నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారని హీరో టీమ్ క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.