సంధ్య థియేటర్ తొక్కసలాట ఘటన తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ఘటనకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ను తప్పు పట్టారు. అలాగే బన్నీని పరామర్శించేందుకు వచ్చిన సినీ ప్రముఖులపై కూడా మండి పడ్డారు. ఇక అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. అయితే ఆదివారం (డిసెంబర్ 22) ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి ముందు నిరసనకు దిగారు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు. కాగా విద్యార్థి సంఘాల ఆందోళనలపై అల్లు అరవింద్ స్పందించారు. ‘మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. పోలీసులు కేసు పెట్టారు. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్లను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మేం కూడా సంయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కోరారు.
మరోవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పోలీస్ బలగాలు భారీగా మొహరిస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా భారీగా ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి వెనక్కు పంపిస్తున్నారు.
అంతకు ముందు సంధ్య’ థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, స్థానిక బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలి. దీనిపై పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలి. తనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిద్ధాం’ అని బండి సంజయ్ కోరారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి