
వివాదాలు, విమర్శల నేపథ్యంలో రిలీజైన తర్వాత కూడా ఆదిపురుష్ మూవీని వివాదాలు వెంటండుతూనే ఉన్నాయి. హిందువులకు పవిత్ర ఇతిహాసమైన రామాయణాన్నిహేళన చేసేలా ఉందంటూ సినిమాపై హిందూ సేన సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇతిహాస కథను సినిమాగా చూసిన జనం.. పాత్రల వేషధారణపై, సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ఓంరౌత్ సినిమాను తన ఇష్టం వచ్చిన రీతిలో తెరకెక్కించారంటూ మండిపడుతున్నారు.
అంతేకాదు ఆదిపురుష్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. హిందువులకు అత్యంత పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ చిత్రం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు రామాయణాన్ని, అలాగే శ్రీరాముడిని, భారత సంప్రదాయాల్ని ఎగతాళి చేసినట్లు ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. కనుక ‘ఆదిపురుష’ చిత్రానికి ఇచ్చిన పబ్లిక్ ఎగ్జిబిషన్‌కు సర్టిఫికేట్ ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోర్టుని కోరారు.
సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదనేది హిందూ సేన ప్రధాన అభ్యంతరం. వాల్మీకి రామాయణం, అలాగే తులసీదాస్ రామచరితమానస్‌లోనూ శ్రీరాముడు, సీత, హనుమంతుడు, రావణుడు సహా ప్రధాన పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్‌లో పాత్రలను చూపించిన తీరుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని పిల్ లో ప్రస్తావించారు. ముఖ్యంగా రావణ బ్రహ్మ శివ భక్తుడని.. తిలకధారణ లేకుండా పాత్రధారిని గడ్డంతో ఏదో క్రూరుడిగా చూపించినట్లు ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది హిందూ సేన.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..