Bapu Movie Review: బాపు సినిమా రివ్యూ.. బ్రహ్మాజీ నటించిన మూవీ ఎలా ఉందంటే..
ఈ మధ్య కాలంలో పల్లెటూరు నేపథ్యం ఉన్న కథలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన సినిమా బాపు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో కొత్త దర్శకుడు దయ తెరకెక్కించిన సినిమా బాపు. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా..

మూవీ రివ్యూ: బాపు
నటీనటులు: బ్రహ్మాజీ, ఆమని, మణి, సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణణ్, రచ్చ రవి తదితరులు
సంగీతం: ఆర్ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫీ: వాసు పెండం
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: దయ
నిర్మాత: భానుప్రసాద్ రెడ్డి
ఈ మధ్య కాలంలో పల్లెటూరు నేపథ్యం ఉన్న కథలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన సినిమా బాపు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో కొత్త దర్శకుడు దయ తెరకెక్కించిన సినిమా బాపు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా..
కథ:
తెలంగాణలో ఒక పల్లెటూరు.. అందులో చంటి (రచ్చ రవి) జెసిబి డ్రైవర్. ఊర్లో బావులన్నీ పూడికలు తీస్తూ ఉంటాడు. అలా తీస్తున్నప్పుడు ఒకరోజు బంగారు విగ్రహం బయటపడుతుంది. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టి అమ్మ లక్ష్మమ్మ (గంగవ్వ)కు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. చంటి వచ్చేసరికి లచ్చమ్మ దాన్ని బావిలో పడేస్తుంది. కట్ చేస్తే అదే ఊళ్లో ఎకరం పొలం ఉన్న రైతు మల్లన్న (బ్రహ్మాజీ). ఆయనకు భార్య సరోజ (ఆమని), ఆటో నడుపుకునే కొడుకు రాజు(మణి), డిగ్రీ చదివే కూతురు వరలక్ష్మి(ధన్య), ఇంటిదగ్గర ఖాళీగా ఉండి చుట్టలు కాల్చే నాన్న రాజయ్య (సుధాకర్ రెడ్డి) ఉంటారు. వ్యవసాయం కోసం ఊర్లో అందిన ప్రతిచోట అప్పు చేస్తాడు మల్లన్న. కానీ చేతిదాకా వచ్చిన పత్తి పంట వాన పాలవుతుంది. దాంతో కష్టాలు మళ్ళీ మొదటికి రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటే రైతు భీమా ఐదు లక్షలు కుటుంబానికి వస్తాయని ఆలోచిస్తాడు. కానీ ఒకరు చూసి ఆ చావును అడ్డుకుంటారు. ఆ తర్వాత కుటుంబమంతా కలిసి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం వల్ల మల్లన్న తండ్రి రాజయ్య చిక్కుల్లో పడతాడు. అంతటి అనూహ్యమైన నిర్ణయం ఏంటి.. అలాంటి కష్టాల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది..? ఆ బంగారు విగ్రహం ఏమైంది అనేది మిగిలిన కథ..
కథనం:
బలగం సినిమా తర్వాత పల్లెటూరి నేపథ్యంలో ఉన్న కథలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే అలాంటి కథలనే ఎక్కువగా నిర్మాతలు కూడా ఆశిస్తున్నారు.. చుట్టూ న్యాచురల్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తే ఈజీగా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయని నమ్ముతున్నారు నిర్మాతలు. బాపు సినిమాలో కూడా ఇదే చేశారు. బ్రహ్మాజీ, ఆమని, ధన్య, అవసరాల శ్రీనివాస్ లాంటి కొందరు నటులు మినహాయిస్తే.. మిగిలిన వాళ్ళంతా కొత్తవాళ్లే. పూర్తిగా ఊరు నేపథ్యంలోనే సాగే కథ ఇది. కథలోకి వెళ్లడానికి ఎక్కువగా టైమ్ తీసుకోలేదు దర్శకుడు దయా. తాను అనుకున్న పాయింట్ మొదటి 10 నిమిషాల్లోనే చెప్పాడు. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్లాడు. బావిలో పూడికలు తీయడం.. విగ్రహం దొరకడం.. గంగవ్వ నీళ్ళపాలు చేయడం.. ఇవన్నీ ఫాస్టుగానే అయిపోతాయి. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. బ్రహ్మాజీ రైతు ఎపిసోడ్ మొదలైన తర్వాత ఊహించినంత వేగంగా కథనం ముందుకు సాగలేదు. కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. రైతు కష్టాలను న్యాచురల్‌గా చూపించారు కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం బాగా మిస్ ఫైర్ అయింది బాపు. బలగం సినిమాలో కథ తక్కువున్నా.. ఎమోషనల్‌గా చాలా బలంగా ఉంటుంది సినిమా. కానీ బాపు సినిమాలో ప్రధానంగా మిస్ అయింది అదే. కథలో తాను చెప్పాలనుకున్న పాయింట్ వదిలేసి.. ఇంకొక క్రైమ్ పాయింట్ మీద కథ చాలా సేపు నడిపాడు దర్శకుడు. దానివల్ల ఫీల్ అనేది రాదు. అంతేకాదు.. బ్రహ్మాజీ కొడుకు రాజు లవ్ ట్రాక్ కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించదు. ఏదో కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది. ముగింపు కూడా ముందుగానే ఊహించొచ్చు. మరోవైపు ధన్య బాలకృష్ణన్, అవసరాల శ్రీనివాస్ ట్రాక్ సైతం పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా లేదు. చివరి 20 నిమిషాల్లో ఎక్కువగా ఎమోషనల్ వైపు అడుగులేసాడు దర్శకుడు దయ.
నటీనటులు:
బ్రహ్మాజీ నటన గురించి ఏం చెప్పాలి..? ఇప్పటి వరకు చేయని ఓ పాత్రలో మెప్పించాడు ఈ సీనియర్ నటుడు. ఆమని కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. మరో కీలకమైన పాత్రలో మేం ఫేమస్ ఫేమ్ మణి అలరించాడు. ఇక ధన్య బాలకృష్ణన్ తన వరకు బాగా నటించింది. అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో అవసరం మేరకు అక్కడక్కడా కనిపించాడు. బాపు టైటిల్ రోల్ చేసిన సుధాకర్ రెడ్డి చాలా బాగున్నాడు. బలగం సినిమాలో కాసేపు కనిపించి అలరించిన ఈ పెద్దాయన.. బాపులో మాత్రం సినిమా అంతా ఉన్నాడు. ఒక కీలకమైన పాత్రలో రచ్చ రవి కూడా చాలా బాగా నటించాడు.
టెక్నికల్ టీం:
బాపు సినిమాకు మెయిన్ హైలైట్ ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం. ఆయన అందించిన పాటలే కాదు.. ఆర్ఆర్ కూడా అదిరిపోయింది. వాసు పెండం సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఊరి అందాలు బాగా చూపించాడు. సినిమా నిడివి కేవలం రెండు గంటలే అయినా కూడా ఎందుకో బాగా లెంతీగా అనిపించింది. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్‌లో కొన్ని సీన్స్‌తో పాటు పాట కూడా కట్ చేసే ఛాన్స్ ఉన్నా రిస్క్ తీసుకోలేదు ఎడిటర్. దర్శకుడి ఛాయిస్ కాబట్టి అతని తప్పు పట్టలేము. దర్శకుడు దయ తనకు వచ్చిన అవకాశం అంతగా వాడుకోలేదనే చెప్పాలి. కథ రాసుకున్నాడు కానీ ఎమోషన్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
పంచ్ లైన్:
బాపు.. ఎమోషన్ మిస్ అయింది బాపూ..!








