Aay Movie Review: ఆయ్ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ బావమరిది సినిమా హిట్టయ్యిందా..?

| Edited By: Rajitha Chanti

Aug 15, 2024 | 9:08 PM

మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్.. ఇప్పుడు ఆయ్ అంటూ వచ్చేసారు. కొత్త దర్శకుడు అంజి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Aay Movie Review: ఆయ్ మూవీ రివ్యూ.. ఎన్టీఆర్ బావమరిది సినిమా హిట్టయ్యిందా..?
Aay Movie
Follow us on

మూవీ రివ్యూ: ఆయ్

నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, అంకిత్, కసిరెడ్డి, వినోద్ కుమార్ తదితరులు

ఎడిటర్: కోడాటి పవన్ కళ్యాణ్

సినిమాటోగ్రఫీ: సమీర్ కల్యాణి

సంగీతం: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ

నిర్మాతలు: బన్నీవాసు, విద్యా కొప్పినీడి

స్క్రీన్ ప్లే, దర్శకుడు: అంజి కె.మణిపుత్ర

మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్.. ఇప్పుడు ఆయ్ అంటూ వచ్చేసారు. కొత్త దర్శకుడు అంజి తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:

బూరయ్య (వినోద్ కుమార్) కొడుకు కార్తీక్ (నార్నే నితిన్) కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఊరికి వచ్చేస్తాడు. ఆయనొచ్చిన విషయం తెలిసి ఫ్రెండ్స్ హరి (అంకిత్ కొయ్య), సుబ్బు (కసిరాజు) కూడా దిగుతారు. చిన్నప్పటి నుంచి తన స్నేహితుల కారణంగా అన్నీ తిప్పలు పడే కార్తీక్.. వాళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతుంటాడు. అదే సమయంలో ఊళ్ళో పల్లవి (నయన్ సారిక)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ అదే అమ్మాయిని ఫ్రెండ్ సుబ్బు ఐదేళ్లుగా ప్రేమిస్తుంటాడు. కానీ పల్లవి మాత్రం కార్తిక్‌ను ప్రేమిస్తుంది.. కానీ కులం వేరు అనే కారణంతో తండ్రి దుర్గ (మైమ్ గోపీ) చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. కులం, స్థాయి కారణంగా ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని కార్తీక్ బాధ పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? కొడుకు బాధను తీర్చేందుకు బూరయ్య ఏం చేస్తాడు అనేది అసలు కథ..

కథనం:

రెండు కోతులు కొట్లాడుకుంటే.. మధ్యలో సైలెంట్‌గా పిల్లి వచ్చి రొట్టెముక్క లాక్కెళ్లిపోయిందంట..! ఈ కథ గుర్తుందా.. ఈ ఆగస్ట్ 15కి ఇదే జరిగేలా కనిపిస్తుందిప్పుడు. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పై అందరి ఫోకస్ ఉంటే..
ఆయ్ అంటూ వచ్చి కలెక్షన్లు అన్నీ పట్టుకెళ్లేలా ఉంది ‘ఆయ్’. నిజానికి ముందు నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అండర్ డాగ్‌గానే తమ సినిమాను తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఇదేం సూపర్ సినిమా కాదు.. కొత్త కథేం కాదు.. కానీ ఉన్నంతలో బెటర్ సినిమా.. అక్కడక్కడా కామెడీ పేలిన సినిమా. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. జాతిరత్నాలు తరహాలోనే కథ ఉండదు.. కామెడీ తప్ప. సెకండాఫ్‌లోనూ అక్కడక్కడా నవ్వులు బాగానే కురిసాయి.. కథ కంటే కామెడీ ఎపిసోడ్స్‌పై ఫోకస్ చేసాడు దర్శకుడు అంజి. ఈ కామెడీతోనే అండర్ కరెంట్‌గా కులం టాపిక్ తీసుకొచ్చాడు. కులం చుట్టూనే ఈ కథను రాసుకున్నాడు. చివర్లో అదే కులానికి ముడిపెట్టి.. చిన్న ట్విస్టుతో రెగ్యులర్ ఎండింగ్ ఇచ్చారు. రిస్క్ అని తెలిసినా కూడా చాలా వరకు కులం టాపిక్ బాగానే తీసుకొచ్చాడు దర్శకుడు. అంతేకాదు.. ఏపీలో గత ప్రభుత్వంపై.. వాలంటీర్ వ్యవస్థపై కూడా పంచులు రాసుకున్నాడు. దాంతో పాటు మరికొన్ని సీన్స్ కూడా బాగానే పేలాయి. క్లైమాక్స్ చాలా బాగుంటుందని ముందు నుంచి హైప్ ఇచ్చారు.. అయితే అక్కడ చూస్తే అంతగా ఏం అనిపించదు. రెగ్యులర్ ఎండింగ్ ఇచ్చారు కాకపోతే అప్పటి వరకు సినిమా రేసీగా వెళ్తుంది కాబట్టి పెద్దగా కంప్లైంట్స్ లేకుండానే థియేటర్ నుంచి బయటికి వచ్చేస్తాం..

నటీనటులు:

నార్నె నితిన్ బాగున్నాడు.. బాగా నటించాడు కూడా. మ్యాడ్ సినిమాతో పోలిస్తే ఇందులో ఇంకాస్త మెరుగయ్యాడు. డాన్సులు కూడా బాగానే చేసాడు. హీరోయిన్ నయన్ సారిక ఓకే. ఆమె నటన బాగుంది. హీరో ఫ్రెండ్స్‌గా అంకిత్ కొయ్య, కసిరెడ్డి కామెడీ అదిరిపోయింది.. అదే మేజర్ ప్లస్ పాయింట్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ క్లైమాక్స్‌లో అద్భుతంగా చేసాడు. చిన్న పాత్రే అయినా మైమ్ గోపీ బాగున్నాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

ఆయ్ సినిమాకు మేజర్ హైలైట్ సంగీతం.. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ చాలా బాగుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించినా బోర్ అయితే కొట్టవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఊరి అందాలు అద్భుతంగా చూపించారు. దర్శకుడు అంజి కామెడీ సినిమా చేసినా.. కులం లాంటి రిస్కీ టాపిక్ టచ్ చేసాడు. అయితే కథలో అదే హైలైట్ అవ్వకుండా కామెడీతో కవర్ చేసాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఆయ్.. కామెడీ పర్లేదండోయ్.. ‘ఆయ్..’