ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల జోరు కనిపిస్తోంది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇటీవల విడుదలైన పుష్ప(Pushpa) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. సుకుమార్ మ్యాజిక్.. అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపంచనంత ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. బన్నీ సరసన రష్మిక మందన్న నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా కల్లోలం తర్వాత విడుదలై సంచనలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయం అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో వైరల్ అవుతోంది.
పుష్ప పార్ట్ 2 స్టోరీ ఇదేనంటూ ఓ గుసగుస వినిపిస్తోంది. పుష్ప సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. భన్వర్ సింగ్ షెఖావత్ గా ఫహద్ ఫాజిల్ ఆకట్టుకున్నారు. అయితే పార్ట్ వన్ లో ఆయన క్యారెక్టర్ కొంత మాత్రమే ఉంది.. కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం ఆయన పాత్ర హైలైట్ గా ఉంటుందని అంటున్నారు పుష్ప టీమ్. పుష్ప 2 లో భన్వర్ సింగ్ షెఖావత్ సిస్టర్ రోల్ ఉంటుందట. అల్లు అర్జున్ కు ఫహద్ ఫాజిల్ మధ్య సిస్టర్ రోల్ ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈ పాత్రలో నటించే హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.