జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్ ఒకడు. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగా నవ్విస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే ఇదంతా రీల్ పైనే. మొన్నటి వరకు రియల్ లైఫ్‌లో పంచ్ ప్రసాద్ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కిడ్నీ సంబంధిత సమస్యలతో తరచూ ఆస్పత్రి పాలయ్యాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో వెంటనే కొత్త కిడ్నీని అమర్చాలని వైద్యులు తెలిపారు. దీంతో తనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం ప్రసాద్ చాలా కాలం ఎదురుచూశాడు. ఇంతలోనే పలు సార్లు ప్రసాద్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎప్పటికప్పుడు డయాలసిస్ చేస్తున్నా పలు ఇన్ఫెక్షన్లు రావడంతో ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి బాగా చేజారింది. ఇతని పరిస్థితి చూడలేక భార్య సునీత సైతం తన కిడ్నీని దానం చేస్తానని ముందుకు వచ్చింది. అయితే చిన్న వయసు కావడంతో వైద్యులు కుదరదని చెప్పేశారు. అయితే భర్తను బతికించుకోవడానికి ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఈ విషయాన్ని పంచ్ ప్రసాద్ నే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కాగా రెండేళ్ల క్రితమే కిడ్నీ డోనర్ కోసం ప్రసాద్ దరఖాస్తు చేశాడు. ఎట్టకేలకు గతేడాది డోనర్ దొరకడంతో ఈ మధ్యనే ప్రసాద్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తైంది.
ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉన్నాడు. మునపటిలాగే వరుసగా టీవీ షోస్, ప్రోగ్రామ్స్‌తో బిజీగా మారిపోయాడు. తాజాగా ఓ టీవీ షోకు తన భార్య సునీతతో కలిసి హాజరయ్యాడీ కమెడియన్. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఏ భర్త చేయని పనిని ప్రసాద్ చేసి చూపించాడు. వేదికపైనే తన భార్య కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ తన భార్య గొప్పతనం గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘ఎవరైనా ప్రేమించినవాళ్లు కలిసి బతకాలని పెళ్లి చేసుకుంటారు. కానీ కేవలం నన్ను బతికించడానికి సునీత పెళ్లి చేసుకుంది. ఆమె చేసినదానికి నేను థాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. సాధారణంగా అమ్మానాన్నల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు. కానీ, నేను కూడా నా భార్యకు అదే చేయాలనుకుంటున్నాను’ అంటూ స్టేజి మీద భార్య కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లు కున్నాడు ప్రసాద్. ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆలాంటి భార్య కాళ్లు కడిగినా తప్పు లేదు అని చెప్పుకొస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి