ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య కనిపించకుండా వెళ్లే సరికి అందరూ కంగారు పడతారు. ఒక భాగ్యం వీర లెవల్లో ఒక్కొక్కరిని ఆడుకుంటుంది. ఇక ఇందిరా దేవి కనకానికి సర్ది చెప్తుంది. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప.. ఇంట్లో నుంచి ఇలా వెళ్లదు కావ్య. ఆ కారణం ఏంటో తెలుసుకుని మళ్లీ కావ్యను వెనక్కి రప్పించే ప్రయత్నంలోనే మేమందరం ఉన్నాం. మా అందరితోనూ తోడుగా మీరూ ఉండండి. గుండె దిటవు చేసుకుని ఉండండి అని చెప్తుంది ఇందిరా దేవి. దీంతో కనకం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఛా ఇంత మందిని బాధ పెట్టి ఎక్కడికి వెళ్లిపోయిందని రాజ్ చిరాకు పడతాడు. ఇక మరోవైపు గుడిలో బాధ పడుతూ కుర్చుంటుంది. అప్పుడే గుడిలోకి పంతులు గారు వస్తారు. అమ్మా.. కావ్య అంటూ పిలుస్తాడు. కానీ కావ్య అసలు సమాధానం ఇవ్వకుండా అలాగే ఉంటుంది. ఆ తర్వాత సీతా రామయ్య, ఇందిరా దేవి ఇద్దరూ బయటకు వచ్చి.. కావ్య గురించి బాధ పడుతూ ఉంటారు. కనకం మాట్లాడే మాటల్లో కూడా న్యాయం ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే పంతులు గారు.. సీతా రామయ్యకు కాల్ చేసి.. అయ్యా మీ మనవరాలు మన గుడిలో ఉన్నా. ఎన్ని సార్లు పిలిచినా పలకడం లేదు. సమాధానం ఇవ్వడం లేదంటూ అని చెప్తాడు. సరే మేము వచ్చేస్తున్నాం.. మేము వచ్చేదాకా ఎక్కడికీ వెళ్లనివ్వకండి అని చెప్తాడు సీతా రామయ్య వెంటనే ఎవరికీ చెప్పకుండా సీతా రామయ్య, ఇందిరా దేవి గుడికి వెళ్తారు.
కావ్యను వెతుక్కుంటూ వచ్చిన సీతా రామయ్య, ఇందిరా దేవి:
గుడికి వచ్చిన సీతా రామయ్య, ఇందిరా దేవి.. అమ్మా కావ్య అని పిలుస్తారు. తేరుకున్న కావ్య.. తిరిగి చూసి పైకి లేస్తుంది కావ్య. ఏంటమ్మా ఇక్కడున్నావేంటి? అని అడుగుతుంది ఇందిరా దేవి. ఎక్కడికి వెళ్లాలో తెలియక అని సమాధానం ఇస్తుంది కావ్య. ఇల్లు ఉందిగా అని ఇందిరా దేవి అనగా.. ఏ ఇల్లు? అత్తారిల్లా? పుట్టిల్లా? అని నిస్సహాయంగా అంటుంది కావ్య. పెళ్లి అయిన ప్రతి ఆడ పిల్లలకు అత్తిళ్లే సొంత ఇల్లు అమ్మా అని ఇందిరా దేవి చెప్తుంది. అది సొంతిల్లు అనుకోవడానికి అక్కడ సొంత మనుషులు ఎవరున్నారా? అని కావ్య చెప్పగా.. మేమంతా లేమా.. అని ఇందిరా దేవి అంటుంది. పెళ్లైన ప్రతి ఆడ పిల్లకు ముందు భర్త తర్వాతే ఎవరైనా సొంత వాళ్లు అవుతారని కావ్య అంటుంది.
రాజ్ రాసిన చీటీని సీతా రామయ్య, ఇందిరా దేవిలకు చూపిస్తుంది కావ్య:
నీ భర్త నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడుగా అని ఇందిరా దేవి అనగా.. నిన్ను వాడు నిజంగా ప్రేమగా చూసుకోవడం లేదమ్మా అని సీతా రామయ్య కూడా అంటాడు. అప్పుడు రాజ్ రాసిన చీటీని సీతా రామయ్యకు ఇస్తుంది కావ్య. అది చదివిన సీతా రామయ్య షాక్ అవుతాడు. ఏంటిది? అని ఇందిరా దేవి అడుగుతుంది. మీ మనవడు వినాయకుడికి నివేదించిన మనసులో మాట అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఇందిరా దేవి కూడా చదివి షాక్ అవుతుంది. మనసు వికలమై వచ్చావా అమ్మా అని సీతా రామయ్య అడగ్గా.. మనసు నిశ్శబ్దమై వచ్చాను తాతయ్యా.. ఆ దేవుడిని ఎన్నో అడగాలని వచ్చాను. ఒక రాతి విగ్రహాన్ని మార్చమని.. ఇంకొక రాతి విగ్రహాన్ని అడగడానికి వచ్చాను.. నేను ఇక్కడ ప్రశ్నార్థకంలా కూర్చుంటే.. ఆ దేవడు ఏం సమాధానం చెప్పలేక.. రాత్రంతా తలుపులు మూసుకుని కూర్చున్నాడు అని కావ్య అంటుంది. మేము ఉన్నాం కదమ్మా మాతో చెప్పవచ్చు కదా.. మేము మందలించేవాళ్లం కదా.. అని సీతా రామయ్య అంటే.. మీరు చెప్పబట్టే కదా నటడించడం మొదలు పెట్టింది. మీరు మందలించినందుకే కదా లేని ప్రేమను ప్రదర్శించింది. సిఫార్సులతో ఒక భర్త, భార్యని గదిలో ఉంచగలరేమో కానీ.. ఒక మదిలో ఉంచలేరు అని కావ్య అంటుంది.
అమ్మ లేని పుట్టిల్లు, భర్త ప్రేమ లేని అత్తిళ్లు రెండూ ఒక్కటే కావ్య:
ఇక నాకు అక్కడ ఏం పని.. అమ్మ లేని పుట్టిల్లు, భర్త ప్రేమ లేని అత్తిళ్లు ఈ రెండూ ఆడదానికి ఒక్కటే అని అంటుంది బాధ పడుతూ. ఇంత చిన్న వయసులోనే నువ్వు నిరాశకు గురైతే.. ఇక ఏన్నేళ్లు సంసారం సాగిస్తావ్ అని ఇందిరా దేవి అంటుంది. సారమే లేని సంసారం నీటి బుడగ లాంటిదే కదా అమ్మమ్మ. నా భవిష్యత్తు నాకు శూన్యంలా కనిపిస్తుంది. ఏం చూసుకుని నేను ఆశగా బ్రతకాలి అని ప్రశ్నిస్తుంది. అత్తగారి ఆదరణ లేదు.. భర్త ప్రేమ దక్కలేదు. అలాగని పుట్టింటికి చేరి ఏ మచ్చా తీసుకురాలేనని అంటుంది కావ్య.
అక్కడికి ఏ అధికారంతో రావాలి? అని ప్రశ్నించిన కావ్య:
ఆ దేవుడు నీతో మాట్లాడలేక.. పూజారి ద్వారా మాకు సమాచారం అందించాడు. నీ ప్రశ్నలకు మా ద్వారా సమాధానం చెప్పాలని మా ఇద్దరినీ ఇక్కడికి పంపించాడు అని చెప్తాడు సీతా రామయ్య. ఏం చేస్తే నీ కాపురం బావుంటుందో మాకు అర్థమైంది.. ఇంటికి రామ్మా అని ఇందిరా దేవి పిలుస్తుంది. ఇంత కాలం నేను కంట తడి పెట్టలేదంటే.. నాకు కన్నీళ్లు లేవని కాదు అమ్మమ్మగారు అర్థం. వాటిని గుండె పొరల్లో ఎక్కడో అదిమి పెట్టుకున్నా.. ధైర్యాన్ని కూటగట్టుకుంటూ అత్తింట్లో నిలదొక్కు కోవాలనుకున్నాను. కానీ ఆ ఇంట్లో నేను ఎప్పటికీ అతిథిలాగే ఉండాలని అర్థమైంది. ఇక అక్కడికి ఏ అధికారంతో రావాలి? అని ప్రశ్నిస్తుంది కావ్య. అమ్మా కావ్యా.. వర లక్ష్మీ వ్రతం రోజు నీకు అక్షింతలు వేయకుండా రాజ్ బాధ పెట్టాడు. అప్పుడే మందలించాను. వాడిలో మార్పు కనిపించింది. అది నిజమని నేను కూడా నమ్మాను కానీ అది నటన అని నువ్వు ముందుగా తెలుసుకున్నా. నేను ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నా.. ఇలాగే వదిలేస్తే మా పెద్దరికానికి అర్థం లేదు అని సీతా రామయ్య అంటాడు.
నా చేతులు దాటిపోయాకే.. బయటకు వచ్చేసాను అమ్మమ్మ: కావ్య
ఏం చేస్తారు తాతయ్యా మళ్లీ మందలిస్తారు అంతేగా.. నా చేతులు దాటిపోయాకే.. బయటకు వచ్చేసాను అమ్మమ్మ అంటుంది కావ్య. నీలో ఈ నిరాశను పిరికి తనాన్ని మొదటి సారిగా చూస్తున్నా కావ్య.. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటావని భ్రమపడ్డాను. ఇలా వెనకడుగు వేసి సమస్య నుంచి పారిపోయి వస్తానని అస్సలు అనుకోలేదు. సాటి స్త్రీగానే మాట్లాడుతున్నా.. అన్ని కాపురాలు సవ్యంగా సాగిపోవు కావ్య.. అని చెప్తుంది ఇందిరా దేవి. అంటే నేను ఇంకా భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉండాలా.. అని కావ్య ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత కావ్యకు సీతా రామయ్య, ఇందిరా దేవి గట్టిగా మద్దతు ఇస్తారు.
ప్రేమతో.. కోపంతో.. ఆవేశంతో ఊగిపోయిన రాజ్.. కావ్యని చెడా మడా వాయించేశాడు:
ఇక అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. ఏంటి రమ్మని బ్రతిమలాడుతున్నారా.. అయినా రానంటుందా అని గట్టిగా అరుస్తాడు. ఏయ్ ఏమైందని వచ్చావ్? రాత్రంతా ఏమైపోయావ్? మేమంతా ఎలా కనిపిస్తున్నాం నీకు? మెంటలా నీకు.. ఉన్నట్టుండి సడన్ గా మాయం అయిపోయి మమ్మల్ని అందర్నీ పిచ్చోళ్లను చేద్దాం అనుకున్నావా అని రాజ్.. కావ్య పైకి చేయి ఎత్తుతాడు. ఆగిపోయావే కొట్టు అని ఇందిరా దేవి అంటుంది. మా పేర్లు కూడా చెప్పి ఇంకో రెండు వేయ్.. ఎవరు అడుగుతారో నేను చూసుకుంటా అని ఇందిరా దేవి అంటుంది. లేకపోతే ఏంటి నాన్నమ్మా.. వీళ్ల అమ్మా నాన్న నన్ను హంతకుడిని చూసినట్టు చూశారు. నన్ను దోషిని చూశారు. అమ్మని, నాన్నని అన్నారు. కన్నవాళ్లు కాబట్టి వాళ్లకు భయం, బాధ ఉంటాయని నేనూ ఊరుకున్నా. కానీ ఏంటి ఈ పిచ్చి పని? అసలు నిన్ను ఎవరు ఏం అన్నారు? ఎవరూ ఏమీ అనకపోయినా ఉన్నట్టుండి మాయం అయిపోతే ఎంత టెన్షన్ పడాలి. రాత్రంతా పిచ్చోళ్లలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. కాస్త అయినా బుద్ధి ఉండాలి.. అవతలి వాళ్లు ఏం అయిపోతారా అనే ఆలోచన ఉండాలి. అని చెడామడా వాయించేస్తాడు రాజ్. అసలు ఏమైనా తెలివి ఉండి చేసిందా.. ఏం నాన్నమ్మా అని అంటాడు రాజ్. నన్ను అడుగుతావేంట్రా.. నీ పెళ్లాన్నే అడుగు అని ఇందిరా దేవి అనగా.. దీన్నే అడుగుతున్నా.. ఈ తింగరి బుచ్చినే అడుగుతున్నా.. ఏయ్ జవాబు చెప్పవేంటి? అని ఊగిపోతాడు రాజ్. చెప్పాల్సిందంతా అమ్మమ్మ, తాతయ్యలతో చెప్పేశాను అని కావ్య అంటుంది.
నన్ను ప్రేమగా చూసుకోవడం నిజం కాదా అని అడిగిన కావ్య:
నాన్నమ్మ ఏం చెప్పింది.. వరాలు అడగడానికి వచ్చిందా.. లేక గుళ్లో అడుక్కోవడానికి వచ్చిందా.. అని కావ్య అంటుంది. అడుక్కోవాల్సిన అవసరం నాకేంటి నా మొగుడు కోటీశ్వరుడు అని చెప్తుంది కావ్య. ఏదో మొక్కులేరా.. నువ్వు మారిపోయి ప్రమేగా చూసుకుంటే ఒక రాత్రంతా కటిన నేలపై గుళ్లో పడుకుంటానని మొక్కుకుందట అని సీతారామయ్య చెప్తాడు. బుద్ధి ఉందా కొంచెమైనా అని రాజ్ అడగ్గా.. ఏ మీరు మారిపోవడం నిజం కాదా? నన్ను ప్రేమగా చూసుకోవడం నిజం కాదా.. అని కావ్య అడుగుతుంది. నిజం కాదా.. అని సీతా రామయ్య, ఇందిరా దేవిలు కూడా అడుగుతారు. అయితే అదే ప్రేమతో ఇంటికి తీసుకెళ్లు నీ పెళ్లాన్ని అని సీతా రామయ్య, ఇందిరా దేవిలు చెప్తారు.