418 Movie Review: 418 మూవీ రివ్యూ.. మైత్రి మూవీ మేకర్స్ హార్రర్ డ్రామా మెప్పించిందా..?
ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన హార్రర్ సినిమా 418. మెడికల్ కాలేజ్ చుట్టూ తిరిగే ఈ సినిమాపై ముందు నుంచి ఆసక్తి బాగా పెంచేసారు మేకర్స్. ట్రైలర్ విడుదలైన తర్వాత మరింత అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: 418
నటీనటులు: చైత్ర J. ఆచార్, రమేష్ ఇందిరా, సూర్య రాజ్ వీరబత్తిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కీర్తన్ నాదగౌడ
సంగీతం: వెంకీ GG
సినిమాటోగ్రఫీ: దినేష్ దివాకరం
ఎడిటర్: అకుల్ అవినాష్
నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్
సమర్పణ: ప్రశాంత్ నీల్
కథ:
కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో కొందరు స్టూడెంట్స్‌కు ఒక పాత హాస్టల్ భవనంలో గదులు కేటాయిస్తారు. అయితే ఆ హాస్టల్ గతంలో ఒక మానసిక వైద్యశాల. అందులోనూ వీళ్ళకి కేటాయించిన గదుల పక్కనే ఉండే 418వ నంబర్ రూమ్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయనే భయంకరమైన ప్రచారం ఉంటుంది. ఆ రూమ్ పక్కన వీరు దిగిన తర్వాత ఊహించని భయానక సంఘటనలు ఎదురవుతాయి. కొందరు అనుమానాస్పదంగా చనిపోతారు. అసలు ఆ 418వ గది వెనుక దాగున్న రహస్యం ఏంటి? ఆ రూమ్‌లో ఉన్న ఆత్మ కథేంటి? అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్.
కథనం:
ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ పేరు ఈ ప్రాజెక్ట్‌కి తోడవడంతో పాటు, సెన్సార్ బోర్డు ఈ సినిమాలోని భయానక దృశ్యాలను చూసి అభ్యంతరాలు చెప్పిందనే వార్తలతో ‘418’ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దర్శకుడు కీర్తన్ నాడగౌడ ఎంచుకున్న నేపథ్యం, ఆ హాస్టల్ సెటప్, ఆత్మ చుట్టూ అల్లిన ఇంట్రడక్షన్ సీన్స్ మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ ఆ ఉత్కంఠ కాసేపు కంటిన్యూ అయింది. సినిమా ముందుకు వెళ్లేకొద్దీ మనం రెగ్యులర్‌గా చూసే పాతకాలపు హారర్ సినిమాల ఫార్ములాలోకి వెళ్లిపోతుంది. పాడుబడిన భవనం, పగతో రగిలిపోయే దయ్యం, ఊహకు అందే భయానక సీన్స్.. ఇవే మళ్లీ మళ్లీ కనిపిస్తాయి. స్క్రీన్‌ప్లేలో ఇంకాస్త కొత్తదనం ఉండుంటే అదిరిపోయేది. ఆడియన్స్‌ను నిజంగా భయపెట్టే సీన్స్ కంటే, కేవలం భారీ సౌండ్స్ పెట్టి ఉలిక్కిపడేలా చేసే సీన్స్‌పైనే డైరెక్టర్ ఎక్కువగా ఆధారపడ్డాడు. నరబలి లాంటి పాయింట్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘చంద్రముఖి’ తరహా ఛాయలు అక్కడక్కడా కనిపించినా.. ఆ స్థాయి ఇంపాక్ట్ మాత్రం తక్కువగానే ఉంటుంది. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా మొదలైంది.. కానీ దాన్ని బాగా ల్యాగ్ చేసినట్లు అనిపించింది. ముఖ్యంగా చివరి అరగంట ఇంకాస్త ఫోకస్ చేసుంటే బాగుండేది. మెయిన్ ప్లాట్ అంతా అక్కడే ఉంది. లాజిక్ లేని సీన్స్‌తో ఆడియన్స్‌కు విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉన్నా.. అది ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో పర్లేదనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి ఈ తరహా రొటీన్ కథకు చాలా ఎక్కువైంది. ఒక అద్భుతమైన హారర్ సినిమా చూస్తామనుకుని థియేటర్‌కు వెళ్లిన వాళ్ళకు ఈ సింపుల్ స్క్రీన్‌ప్లే రొటీన్‌గానే అనిపిస్తుంది.
నటీనటులు:
ఈ సినిమాలో అత్యుత్తమ నటన కనబరిచింది మాత్రం చైత్రా జె. ఆచార్. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో తన నటనతో ఆడియన్స్‌లో ఒకరకమైన భయాన్ని క్రియేట్ చేసింది. ప్రీతి పగడాల తెరపై అందంగా కనిపించి యూత్‌ను ఆకట్టుకుంటుంది. సైకియాట్రిస్ట్‌గా రమేష్ ఇందిర పాత్ర పర్వాలేదనిపించినా.. ముగింపు వరకు ఆ క్యారెక్టర్‌కు అంత ఇంపార్టెన్స్ దక్కలేదు. చరణ్ లక్కరాజు, సూర్య రాజ్ తమ పరిధి మేరకు నటించారు. మిగిలిన వాళ్లు కూడా ఓకే అనిపించినా, గుర్తుపెట్టుకునే రేంజ్ పెర్ఫార్మెన్స్ ఎవరిదీ లేదు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు ప్రధాన బలం టెక్నికల్ టీం. సౌండ్ డిజైన్, వెంకీ జీజీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి. భయపెట్టే వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమాలో వచ్చే ఒక పాట మాత్రం వెంటాడుతుంది. దినేష్ దివాకరన్ కెమెరా పనితనం పాత కాలపు హాస్టల్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ లోగోను హారర్ థీమ్‌కు తగ్గట్లుగా యానిమేట్ చేయడం బాగుంది. కథలో లేని బలాన్ని నేపథ్య సంగీతంతో లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అకుల్ అవినాష్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. నిడివి బాగా ఎక్కువవడం, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌ని ట్రిమ్ చేయకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా 418.. అక్కడక్కడా లోపాలున్నా హార్రర్ థ్రిల్లర్..!
