సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని పాత్రలకు సింహాసనం వేసే నటులు కొందరుంటారు. అలా మన్యం దొర అల్లూరి పాత్రకు వెండి తెరమీద బంగారు సింహాసనం వేసిన నటుడు కృష్ణ. ఇలాంటి చారిత్రకాలకే కాదు, మరెన్నో పౌరాణికాల్లోనూ ప్రతిభ చూపించిన నటుడాయన. సాహసాల సూపర్‌స్టార్ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు. కానీ సిల్వర్ స్క్రీన్ మీద ఆయన క్రియేట్ చేసిన రికార్డులు, సాంకేతికంగా ఆయన చూపించిన సాహసాలు, నమ్మకంగా ఆయన చేసిన కృషి.. నేటి తరానికి మార్గదర్శకాలు.
ప్రేక్షక జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోగల పాత్రలెన్నింటికో సూపర్ స్టార్ కృష్ణ ప్రాణం పోశారు. ప్రజారాజ్యం, ఈనాడు…లాంటి ఎన్నో సినిమాల్లో ప్రజాపక్షపాతిగా నిలిచిన నటశేఖరుడు కృష్ణ. ఆయన సినిమాల్లో కేవలం తెలుగు ప్రజలనే కాదు.. యావత్ భారతావని ప్రజానీకాన్ని విశేషంగా ఆకట్టుకున్న అల్లూరి సీతారామరాజు అగ్రభాగంలో నిలుస్తుంది. కృష్ణ ప్రజారాజ్యం సినిమా యావత్ సమాజంలోని రైతాంగం సమస్యల మూలాలను పెకిలించింది. రైతాంగం సమస్యలను ఎలుగెత్తి చాటింది.
ఇక అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ సామ్రాజ్యపు దోపిడీ పీడనలను నిలదీస్తూ.. ‘రూతర్ ఫర్డ్’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ స్వతంత్ర భారతావని సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇక ‘అగ్ని… జమదగ్ని’ అంటూ సమాజంలోని అవినీతిని ఎండగడుతూ కృష్ణ ఉద్వేగంగా చెప్పిన డైలాగ్స్ మరపురానివి.. మరువలేనివి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..