Sonu Sood at Vizag Airport: విశాఖ ఎయిర్ పోర్ట్‌లో సినీ నటుడు సోనూసూద్ సందడి చేశారు. అనకాపల్లిలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు.. సోనూసూద్ విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. సోనూ సూద్ వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అభిమానులు ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. సోనూసూద్‌ను చూడగానే హార్టీ వెల్కమ్ హీరో సోనూ సూద్ అంటూ వార్మ్ వెల్కమ్ పలకారు. ఫ్యాన్స్ సందడితో సోనూసూద్ కూడా వారికి అభివాదం తెలుపుతూ ఫొటోలు దిగారు. అనంతరం పలువురు అభిమానులు సోనూ వెంట అనకాపల్లికి ర్యాలీగా వెళ్ళడం విశేషం.
దసరా ఉత్సవాలను అనకాపల్లి యువజన సంఘాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాయి. ఏటా ఎవరో సినీ నటులను తీసుకొచ్చి సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి అందుకు సోనూసూద్ ముఖ్య అతిథిగా మారారు. గవరపాలెంలో ఇటీవల కొత్తగా నిర్మించిన కనకదుర్గ అమ్మవారి గుడిని మొదట సోనూ సూద్ సందర్శిస్తారు. అనంతరం నూకాలమ్మ గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన చివరి రోజు కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
సాధారణంగా సినీ నటులు ఏదైనా కార్యక్రమానికి రావాలంటే లక్షల రూపాయలు తీసుకుని ఆయా కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. కానీ సోనూసూద్ మాత్రం అలాంటి కండిషన్స్ ఏవీ పెట్టరు. ముందుగా తనకు ఆ కార్యక్రమం నచ్చాలి. పదిమంది మెచ్చేదై ఉండాలి. అనంతరం కార్యక్రమానికి హాజరైనందుకు తనకు ఏమీ వద్దని, అవకాశం ఉంటే సూద్ ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వాలని సోనూ సూద్ కోరతారట. దైవ కార్యక్రమం కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగిందట. తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదు.. కానీ సూద్ ఫౌండేషన్ కు ఏదైనా సహాయం చేస్తే.. ఆ ఫౌండేషన్ ద్వారా పది మందికి సహాయం చేసే అవకాశం ఉంటుందని సూద్ సూచించడంతో అనకాపల్లి ఉత్సవకమిటీ సభ్యులు అదే చేశారని సమాచారం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..