పెళ్లి చేసుకోకుండా నాట్యానికే జీవితం అంకితం చేసిన టాలీవుడ్ హీరోయిన్
అత్యంత ప్రతిభావంతురాలైన నటి, నర్తకి శోభన జీవితం నాట్యానికి అంకితం. విశాల నేత్రాలు, అభినయం, అద్భుతమైన నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, తెలుగు, మలయాళ చిత్రాల్లో రాణించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న శోభన, వివాహం చేసుకోకుండా నాట్య కళారాధనకే జీవితాన్ని అంకితం చేసి, ఒక బాలికను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు.

భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన, మంత్రముగ్ధులను చేసే నృత్యంతో ప్రత్యేక ముద్ర వేసిన కళాకారిణి శోభన చంద్రకుమార్ పిళ్ళై, శోభనగా సుపరిచితురాలు. 1970 మార్చి 20న తిరువనంతపురంలో జన్మించిన ఆమె, ట్రావెన్కోర్ సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు. ప్రముఖ మలయాళ నటి సుకుమారి ఆమెకు దగ్గరి బంధువు. ఈ వారసత్వం ఆమెకు చిన్నతనం నుంచే కళారంగంతో అనుబంధాన్ని పెనవేసింది. రెండేళ్ల ప్రాయంలో రాజేష్ ఖన్నా నటించిన అమర్ ప్రేమ్ సినిమాలో కొన్ని క్షణాల పాటు కనిపించిన శోభన, 1980లో కె.ఆర్. విజయ ప్రోత్సాహంతో మంగళనాయకి చిత్రంలో బాలనటిగా నటించారు. ఈ సినిమా శతదినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అమితాబ్ బచ్చన్, పదేళ్ల శోభనను చూసి “యు ఆర్ ద బేబీ” అంటూ సరదాగా షీల్డ్ అందించిన సంఘటన ఆమె చిన్నతనం విశేషాలలో ఒకటి. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం భక్త ధృవ మార్కండేయ, ఇందులో ధృవుని తల్లిగా నటించి ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్నారు. ఈ తర్వాత ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి చదువు, నృత్యంపై దృష్టి సారించారు.
మద్రాసులో పెరిగిన శోభన, మొదట్లో నాట్యంపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. తల్లి ప్రోత్సాహంతో భరతనాట్యంలో నిష్ణాతులైన శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ వద్ద శిష్యురాలిగా చేరారు. పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. తన గురువుతో కలిసి అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. నృత్యం, సినిమా కెరీర్ మధ్య చదువుకు బ్రేక్ వచ్చినా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రైవేటుగా చదివి 1989లో వైజాగ్ సెంటర్‌లో ఇంటర్ పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ కూడా అయ్యారు. 1984లో మలయాళంలో విడుదలైన ఏప్రిల్ 18 చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేశారు. బాలచంద్ర మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శోభనను హీరోయిన్‌గా ఎంపిక చేయమని నటి సుకుమారి సూచించారు. తెలుగులో ఆమె తొలి చిత్రం నాగార్జున సరసన విక్రమ్, అయితే తొలుత విడుదలైన చిత్రం భానుచందర్ హీరోగా నటించిన దాగుడుమూతలు. ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.
చిరంజీవి తొలి సొంత సినిమా రుద్రవీణలో, రౌడీ అల్లుడు చిత్రంలోనూ ఆయనతో జతకట్టారు. బాలకృష్ణ సరసన మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి మ్యూజికల్ హిట్‌లుగా నిలిచాయి. నిప్పురవ్వలో బాలకృష్ణతో కలిసి ఓ ప్రత్యేక గీతంలో అలరించారు. నాగార్జునతో నేటి సిద్ధార్థ, రక్షణ, వెంకటేశ్ తో అజేయుడు, త్రిమూర్తులు, మోహన్ బాబుతో అల్లుడు గారు, రౌడీగారి పెళ్ళాం, గేమ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలాగే కృష్ణ, రాజేంద్రప్రసాద్, భానుచందర్, కార్తీక్ వంటి హీరోలతో కూడా స్క్రీన్ పంచుకున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళ చిత్రం మణిచిత్రతాళులో ద్విపాత్రాభినయంతో అద్భుతమైన నటన కనబరిచి జాతీయ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్నారు. దక్షిణాదిన నాలుగు భాషల్లో నటించిన శోభన, సినిమా రంగంలో పోటీ పెరిగి అవకాశాలు తగ్గుముఖం పట్టిన సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహం చేసుకోకుండా తన ఎంతో ఇష్టమైన నాట్యకళకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. అప్పటి నుంచి నాట్య కళారాధనలో కొనసాగుతూ, దేశ విదేశాల్లో తన భరతనాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. కాగా కల్కీ సినిమాలో ఆమె కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే.
చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తల్లితో కలిసి నివసిస్తున్న శోభన, తన రెండంతస్తుల భవంతిలో కింది పోర్షన్‌లో డాన్స్ స్కూల్‌ను నిర్వహిస్తూ, పై పోర్షన్‌లో ఉంటున్నారు. పిల్లలు లేరనే లోటు లేకుండానే, ఆరేళ్ల క్రితం ఒక అనాథ బాలికను దత్తత తీసుకుని, ఆమెకు అనంత నారాయణి అని పేరు పెట్టుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందిన శోభన, 56 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా ఉంటూ రోజుకు నాలుగు గంటలపాటు నృత్య సాధన చేస్తారు. తనకు నచ్చిన పాత్ర వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెబుతున్నారు.
View this post on Instagram
