Sai Dharam Tej: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై సినీ ఇండస్ట్రీ, మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని.. ఏపీ విజయవాడ వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థలో ప్రార్థలు కొనసాగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆశ్రమంలోని వృద్ధులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అందరి బాగు కోరే ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిన అనంతరం అన్నం కూడా తినాలనిపించడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ కన్నీరుపెట్టుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ఆశ్రమానికి రావాలంటూ ఆశ్రమంలోని వృద్ధులు కోరుతున్నారు.
కాగా.. విజయవాడలో అమ్మ ప్రేమ ఆదరణ వృద్దుల ఆశ్రమం నిర్మాణానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతంలో భారీగా విరాళం ఇచ్చారు. వృద్ధుల కోసం రెండంతస్తుల భవనం సైతం కట్టించారు. గతంలో సాయి ధరమ్ తేజ్ పలుమార్లు అమ్మ ప్రేమ ఆదరణ సేవా సమితి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అయితే.. సాయి ధరమ్ తేజ్ ఈ ప్రాంతానికి షూటింగ్ నిమిత్తం ఎప్పుడు వచ్చినా ఆశ్రమానికి వచ్చేవారంటూ ఆశ్రమం నిర్వాహకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాగా.. సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదమేమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. వచ్చే 24 గంటల్లో మళ్లీ పరీక్షలు చేస్తామని అపోలో డాక్టర్లు చెప్పారు. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని.. 72గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్లు అపోలో వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇన్‌సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్ లేదని వైద్యులు ప్రకటించారు. సిటీ స్కాన్‌తో పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించి.. తేజ్.. తల, వెన్నుముకలకు తీవ్ర గాయాలేవీ కాలేదన్నారు వైద్యులు.
Also Read: