రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సుహాస్ ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఇందులో భాగంగా ‘యాంగర్ టేల్స్’ పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. ఇందులో సుహాస్‌తో పాటు బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బింధు మాధవి, ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. అలాగే యంగ్ డైరెక్టర్లు తరుణ్ భాస్కర్, వెంకటేశ్ మహా (కేరాఫ్ కంచరపాలెం) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభల తిలక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో మార్చి 9న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం యాంగర్ టేల్స్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా సుహస్ గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉంది. బిందు మాధవి, మడోన్నా పాత్రలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురు వారికి నచ్చని జీవితం ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటి? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అన్న ఆసక్తికర అంశాలతో యాంగర్ టేల్స్ సిరీస్‌ను తెరకెక్కించారు.
బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తర్వాత బిందుమాధవి నటిస్తోన్న తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ సిరీస్‌తోనే 12 ఏళ్ల విరామం తర్వాత ఆమె టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మదనపల్లెకు చెందిన బిందు మాధవి 2008లో ఆవకాయ్ బిర్యానీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత బంపర్ ఆఫర్, ఓం శాంతి, రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమీందార్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆతర్వాత కేవలం కోలీవుడ్‌కే పరిమితమైంది. అయితే గతేడాది బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లో అడుగుపెట్టి విజేతగా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..