ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ముందుంటారు డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు. ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో ఆయన శైలివేరు. దివంగత నటుడు చలపతిరావు తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. అల్లరి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత అనసూయ, అమరావతి, అవును వంటి సినిమాలను రూపొందించారు. ఈ చిత్రాలు హిట్స్ కావడంతో.. మరోసారి అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా కాలం గ్యాప్ తర్వాత రవిబాబు తెరకెక్కించిన చిత్రం అసలు. పూర్ణ, రవిబాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అటు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఏప్రిల్ 13 నుంచి ఈటీవీ విన్ యాప్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా గత అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై ఈ సినిమాను రవిబాబు నిర్మించారు. ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. చక్రవర్తి అనే ప్రొఫెసర్ హత్య విచారణ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవిబాబు కనిపించగా.. సూర్యకుమార్, సత్యకృష్ణన్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.
అరుదైన హత్య నేపథ్యంతో కూడిన కథ ఇది అని.. హత్య చేసిన హంతకుడు ఎదురుగానే కనిపిస్తాడని.. కానీ నిరూపించడం సాధ్యం కాదని.. హత్యకు గురైన వ్యక్తికీ.. హంతకుడికీ చాలా దగ్గర సంబంధం ఉండడం.. అతడిని పట్టించేందుకు పోలీస్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. చివరకు హంతకుడు దొరికాడా ?లేదా ? అనేదే అసలు సినిమా కథ అని ఇదివరకు డైరెక్టర్ రవిబాబు తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.