ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు సైతం సిరీసుల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు హ్యాండ్సమ్ హీరో ఆర్య కూడా ఈ జాబితాలోకి అడుగుపెట్టారు. ది విలేజ్ పేరుతో ఓ హార్రర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా మిళింద్ రావు ది విలేజ్ వెబ్ సిరీస్ ను మిళింద్ రావు తెరకెక్కించారు. మన దేశంలో ఒక గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందిన మొట్ట మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. ఇందులో ఆర్య సరసన దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆజియా, ఆడుకులం నరేన్, తలైవాసల్ విజయ్, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, పూజ, జయ ప్రకాష్, పి.ఎన్ సన్నీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గౌరవ్ శ్రీవాస్తవ్, ప్రసాద్ పట్నాయక్ లు ది విలేజ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 24 నుంది ది విలేజ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆర్య వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అలాగే సిరీస్‌కు సంబంధించి ఒక టీజర్‌ను రిలీజ్ చేసింది.
ది విలేజ్ వెబ్ సిరీస్ టీజర్ ఎంతో భయానకంగా ఉంది. ముఖ్యంగా చెట్టు రూపంలో ఓ మనిషి తల కనిపించడం, గట్టిగా అరవడం.. దీనికి నీడలో ఉన్న దాగి రహస్యాలను వెలికి తీయండి అని చెప్పి భయపెట్టించారు మేకర్స్. అలాగే ‘భయం లోతుల్లోకి వెళ్లేందుకు సాహసించండి’ అంటూ రిలీజ్ చేసిన మరో వీడియోలో సాయుధ దళాలపై వింత మనుషులు దాడి చేయడం, ఆర్య కూడా వారిని ఎదుర్కోవడం చూస్తుంటే ఒళ్లంతా గగుర్పాటుకు గురి చేస్తోంది. చూస్తుంటే ప్యూర్ హార్రర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఆర్య తెలుగులో ‘సైంధవ్’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..