బాహుబలి, నిశ్శబ్ధం తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని హీరోయిన్ అనుష్కా శెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. గతంలో సందీప్ కిషన్‌తో కలిసి రారా కృష్ణయ్య వంటి ఎంటర్‌టైనర్‌ను తీసిన డైరెక్టర్ మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఈ సినిమాలో స్వీటీకి జోడిగా నటించాడు. సెప్టెంబర్ 7న విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డీసెంట్ హిట్‌గా నిలిచింది. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో పోటీపడి మరి భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్‌గా రూ. 50 కోట్లకు పైగా రాబట్టింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పటికీ సినిమాలో అనుష్క, నవీన్‌ల జోడీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ రోల్స్‌లోనే కనిపించిన నవీన్ పొలిశెట్టి ఇందులో తన నటనతో కన్నీళ్లు కూడా తెప్పించాడు. అద్భుతంగా ఎమోషన్స్‌ను పండించి హ్యాట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడీ యంగ్ హీరో. ఇక స్వతంత్ర్య భావాలున్న అమ్మాయిగా అనుష్క అభినయం అందరినీ కట్టిపడేసింది. థియేటర్లలో సూపర్‌హిట్‌గా నిలిచిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అనుష్క, నవీన్ పొలిశెట్టిల సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. అక్టోబర్ 5 నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సూపర్‌హిట్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
యువీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టితో పాటు పవిత్ర లోకేష్, మురళీ శర్మ, జయసుధ, నాజర్, భివన్ గోమటం, నాజర్, తులసి, సోనియా దీప్తి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రధన్, గోపీసుందర్ సంగీతం అందించగా, నిరవ్ షా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. స్వతంత్ర్య భావాలున్న అనుష్క పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనాలని అనుకుంటుంది. బిడ్డను కనేందుకు తగిన యువకుడి కోసం వెతుకుతుండగా అప్పుడే నవీన్ పరిచయమవుతాడు. మరి వారిద్దరి ప్రయాణం ఎలా సాగింది? వారి బంధాన్ని సమాజం అంగీకరిస్తుందా? పెళ్లి బంధం, ఇతర సమస్యలు లేకుండా పిల్లలను కనడం సముచితమా అనే సున్నితమైన అంశాలన ఇందులో హృద్యంగా చూపించారు. మరి థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.