మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు బనాయించిందని బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై మరోనటి నోరా ఫతేహి పరువునష్ట దావా వేసింది. దీనిపై నోరా ఫతేహి శనివారం (జనవరి 21) ఢిల్లీ కోర్టులో క్రిమినల్ కేసు వేసింది. జాక్వెలిన్ ఉద్ధేశ్యపూర్వకంగా తన గౌరవప్రతిష్టలను భంగపరుస్తోందని, తన సినీ కెరీర్‌ను దెబ్బతీస్తున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తాకథనాలు వెలువరించిన 15 మీడియా సంస్థలపై కూడా పరువు నష్ట దావా వేసింది.
నోరా ఫతేహి దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మార్చి 25న విచారించనుంది. కాగా 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్టయ్యాడు. ఐతే ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు బాలీవుడ్ తారలతోపాటు పలువురిని దర్యాప్తు సంస్థలు పలుమార్లు విచారించాయి. ఈ క్రమంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ విచారించిన సమయంలో ఆమె నోరా ఫతేహి పేరును బయటపెట్టింది. కన్మాన్ సుకేష్ చంద్రశేఖర్ నుంచి తనతోపాటు మరో నటి నోరా ఫతేహీ కూడా బహుమతులు అందుకున్నట్లు ఈడీకి తెల్పింది. దాంతో ఈడీ అధికారులు నోరాకు కూడా నోటిసులు ఇచ్చి విచారించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఫెర్నాండెజ్ తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించిందని నోరా ఫతేహి తన ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తోపాటు, ఆమె ఆరోపణలను ప్రచురించిన మీడియా సంస్థలపైన నోరా పరువు నష్టం దావా వేసింది.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.