టాలీవుడ్, కోలీవుడ్‌లో నయా ట్రెండ్.. ఒకే బాటలో ఆ తెలుగు, తమిళ దర్శకులు..

బౌండరీస్ వద్దు.. హాయిగా కలిసి పని చేసుకుందాం అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో నడుస్తున్న ట్రెండ్ ఇదే.

టాలీవుడ్, కోలీవుడ్‌లో నయా ట్రెండ్.. ఒకే బాటలో ఆ తెలుగు, తమిళ దర్శకులు..
Telugu and Tamil Movie Directors
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 15, 2022 | 9:10 PM

కలిసుంటే కలదు సుఖం అని ఊరికే అనలేదు పెద్దలు. మరి వాళ్లు చెప్పినపుడు మన వాళ్లు కూడా పాటించాలి కదా..! తాజాగా తెలుగు, తమిళ దర్శకులు ఇదే చేస్తున్నారు. ఇన్నాళ్లూ మీకు మీరే.. మాకు మేమే అన్న ఈ దర్శకులు.. ఇప్పుడు మనమంతా ఒక్కటే అంటున్నారు. బౌండరీస్ వద్దు.. హాయిగా కలిసి పని చేసుకుందాం అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో నడుస్తున్న ట్రెండ్ ఇదే. మరి ఆ దర్శకులెవరు.. వాళ్ళ కథేంటి..?

తెలుగు, తమిళం, కన్నడ అంటూ ఉన్న హద్దుల్ని కొన్ని సినిమాలు ఈ మధ్య చెరిపేసాయి. అంతా ఒక్కటే.. మనమంతా ఒక్క సినిమా అనే భాషలోనే ప్రేక్షకులతో మాట్లాడుతున్నామంటున్నారు దర్శకులు. అందుకే మొన్నటి వరకు ఎవరి ఇండస్ట్రీలలో బిజీగా ఉన్న ఆయా దర్శకులు.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలను కలిపేసుకుంటున్నారు. శంకర్, వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల, వెంకట్ ప్రభు, లింగుస్వామి ఇలా చెప్తూ పోతే చాలా మంది దర్శకులు.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్నారు.

30 ఏళ్ళ కెరీర్‌లో తమిళం తప్ప తెలుగు తెలియని శంకర్.. తొలిసారి రామ్ చరణ్ హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగానే పూర్తయింది. ఇక కెరీర్ మొదట్నుంచి తెలుగు సినిమాలే చేసిన వంశీ పైడిపల్లి.. అదే దిల్ రాజు నిర్మాణంలో ఇప్పుడు తమిళం తప్ప తెలుగు తెలియని విజయ్ హీరోగా ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మాస్ సినిమాల స్పెషలిస్ట్ లింగుసామి సైతం తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నారు. రామ్ హీరోగా ఈయన ది వారియర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జులై 14న విడుదల కానుంది. మరోవైపు బోయపాటి శ్రీను మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ దాటి అడుగు బయటికి పెడుతున్నారు. రామ్ హీరోగా పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నారు బోయపాటి శ్రీను. ఇక వెంకీ అట్లూరి ధనుష్ హీరోగా సార్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కుతోంది.

యూనివర్సల్ కథలు చెప్తున్నపుడు.. ఒక్క ఇండస్ట్రీకే పరిమితం కావడం ఎందుకు..? దర్శకులు ఒకే ఇండస్ట్రీలోనే గిరి గీసుకుని ఉండటం ఎందుకు..? అడుగు బయటికి వేస్తే.. మరో మార్కెట్ కలిసొస్తుంది కదా..? ఆ కథకు స్టార్ హీరో దొరికితే అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చూపించొచ్చు. మన దర్శకుల ప్లాన్ కూడా ఇదే. అందరికీ నచ్చే కథ రాసుకుని.. అన్ని ఇండస్ట్రీలను దున్నేయాలని చూస్తున్నారు.

ఒకప్పుడు ఏ ఇండస్ట్రీలో ఉండే దర్శకులకు.. ఆ ఇండస్ట్రీలోనే ఎక్కువగా గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. కావాలంటే లోకేష్ కనకరాజ్‌నే తీసుకోండి.. ఈయనను ఒక్క ఇండస్ట్రీకి పరిమితం చేయలేం. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సంచలన విజయాలతో లోకేష్ రేంజ్ ఆకాశమంత ఎత్తుకు చేరిపోయింది. త్వరలోనే రామ్ చరణ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు లోకేష్. అలా టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్నారు ఈయన.

జాతి రత్నాలు సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ. ఈయన ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. అక్కడ శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోను తన కథతో మెప్పించి.. ప్రిన్స్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఆగస్ట్ 31న ప్రిన్స్ విడుదల కానుంది. తెలుగులోనూ ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే వెంకట్ ప్రభు కూడా నాగ చైతన్యతో స్ట్రెయిట్ తెలుగు సినిమా అనౌన్స్ చేశారు.

20 ఏళ్ళుగా తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్న శేఖర్ కమ్ముల.. తాజాగా తన కథ కోసం హీరోను తమిళ ఇండస్ట్రీలో వెతుక్కున్నారు. ఫిదా, లవ్ స్టోరీ లాంటి సక్సెస్‌ల తర్వాత ఈయన ధనుష్ హీరోగా సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో సార్ సినిమా చేస్తున్న ధనుష్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల సినిమాపై ఫోకస్ చేయనున్నారు. మొత్తానికి తెలుగు, తమిళ దర్శకులు కలిసుంటే కలదుసుఖం అంటూ పాడుకుంటున్నారు.

-ప్రవీణ్ కుమార్, టీవీ9 తెలుగు ET Team