AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ది ఒడిస్సీ’ సినిమా రివ్యూ.. క్రిస్టోఫర్ నోలెన్ మరోసారి మాయ చేసాడా..?

The Odyssey Movie Review: క్రిస్టోఫర్ నోలెన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోమర్ రచించిన గ్రీక్ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ విజువల్ ఎపిక్‌ను పూర్తిగా IMAX కెమెరాలతో చిత్రీకరించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నోలెన్ మరోసారి తన మ్యాజిక్‌ను చూపించాడా? ఈ రివ్యూలో తెలుసుకోండి.

‘ది ఒడిస్సీ’ సినిమా రివ్యూ.. క్రిస్టోఫర్ నోలెన్ మరోసారి మాయ చేసాడా..?
The Odyssey Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 4:17 PM

Share

క్రిస్టోఫర్ నోలెన్ తెరకెక్కించిన ది మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో హోమర్ రాసిన ‘ది ఒడిస్సీ’ అనే గ్రీక్ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను నోలెన్ తెరకెక్కించారు. ఇండియాలో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కిన సినిమా కావడంతో.. ‘ఒడిస్సీ’ని థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు క్యూ కట్టారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: ది ఒడిస్సీ

నటీనటులు: మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హ్యాథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, జెండాయా, లుపితా న్యోంగో

మూలకథ: హోమర్ రాసిన ‘ఒడిస్సీ’ ఇతిహాసం

సినిమాటోగ్రఫీ: హోయ్టే వాన్ హోయ్టెమా

ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్

సంగీతం: లుడ్విగ్ గొరాన్సన్

దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్

నిర్మాతలు: ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్

కథ:

క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలో హోమర్ రాసిన గ్రీక్ ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత తన సొంత రాజ్యమైన ఇథాకాకు తిరిగి వెళ్లాలని హీరో ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) చేసే పదేళ్ల సుదీర్ఘ ప్రయాణమే ఈ చిత్ర మూలకథ. దారిలో అతనికి ఎదురయ్యే విచిత్రమైన జంతువులు, శక్తిమంతమైన దేవతలు, భయంకరమైన రాక్షసులను దాటుకుని తన కుటుంబాన్ని ఎలా చేరుకున్నాడనేది ప్రధాన కథాంశం. మరోవైపు ఇథాకా రాజ్యంలో రాజు లేకపోవడంతో సింహాసనాన్ని ఆక్రమించాలని యాంటీనస్ (రాబర్ట్ ప్యాటిన్సన్) అనే విలన్ ప్రయత్నిస్తుంటాడు. ఈ కష్టకాలంలో తన తండ్రిని వెతుక్కుంటూ కొడుకు టెలిమాకస్ (టామ్ హాలండ్) ఎలాంటి సాహసం చేశాడు, భర్త తప్పకుండా తిరిగి వస్తాడనే నమ్మకంతో భార్య పెనెలోప్ ఆ నిరీక్షణను ఎలా కొనసాగించిందనేది అసలు కథ..

కథనం:

క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి సన్నివేశం నుంచే తనదైన మార్క్ విజువల్స్‌తో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేశారు. మూడు వేల ఏళ్ల నాటి పాత కథను నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చాలా అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. సినిమాలో ప్రతి ఘట్టం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను కోటానుకోట్ల ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ట్రోజన్ యుద్ధం సన్నివేశాలు, ఒడిస్సియస్ ఒంటికన్ను రాక్షసుడిని ఎదుర్కొనే ఎపిసోడ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. పదేళ్ల ప్రయాణంలో హీరో పడే మానసిక వేదనను, ఎదుర్కొనే సవాళ్లను దర్శకుడు చూపించిన విధానం కట్టిపడేస్తుంది. అయితే క్లైమాక్స్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలు ప్రేక్షకులను చివరివరకు సీట్లలో కూర్చోబెడతాయి. కథలో వీరత్వంతో పాటు కుటుంబం కోసం తపించే ఒక మనిషి అంతర్గత ఘర్షణను చూపించడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. కాకపోతే హెలెన్ పాత్రకు ఎంచుకున్న నటి విషయంలో మాత్రం ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఇతిహాసాల్లో వర్ణించిన ఆ పాత్రలో లుపితా న్యోంగో అంతగా ఒదగలేకపోయారు. ఆ ఒక్క చిన్న లోపం మినహాయిస్తే, స్క్రీన్‌ప్లే పరంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది.

నటీనటులు:

ఒడిస్సియస్ పాత్రలో మ్యాట్ డామన్ ఒదిగిపోయిన తీరు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కేవలం భయమెరుగని యోధుడిలా మాత్రమే కాకుండా, తన నిర్ణయాల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయనే బాధను అనుభవించే సగటు మనిషిగా ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. కొడుకు పాత్రలో టామ్ హాలండ్ ఎంతో పరిపక్వతతో నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. ఇక రాజ్యానికి రాణిగా, భర్త కోసం నిరీక్షించే భార్యగా ఆన్ హ్యాథవే తన నటనతో జీవించేశారు. ఆమె నటనకు కచ్చితంగా ఆస్కార్ స్థాయిలో అవార్డులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విలన్ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ తనదైన శైలిలో క్రూరత్వాన్ని పండించి కథకు మంచి బలాన్ని చేకూర్చారు. హీరోకి నమ్మకమైన బంటుగా హిమేష్ పటేల్, అంధ ప్రవక్తగా జేమ్స్ రెమార్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కనిపించిన చార్లీజ్ థెరాన్, జెండాయా తమ ప్రెజెన్స్‌తో స్క్రీన్‌పై మెరిశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు అతిపెద్ద బలం సాంకేతిక నిపుణుల పనితీరే. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ ఏడాదిలోనే అత్యుత్తమంగా నిలుస్తాయి. ప్రతి సన్నివేశాన్ని అత్యంత భారీ వ్యయంతో, కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. నేపథ్య సంగీతం సన్నివేశాల తీవ్రతను మరింత పెంచి, ప్రేక్షకులకు ఒక గ్రాండ్ సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ క్రీస్తుపూర్వం నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు సృష్టించడంలో విజయవంతమైంది. ఎడిటింగ్ కూడా పర్లేదు. దాదాపు 3 గంటల నిడివి ఉండటంతో అక్కడక్కడా స్లో అయిన ఫీల్ వస్తుంది. కాకపోతే క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వ ప్రతిభ మరోసారి ఈ చిత్రాన్ని ఒక మాస్టర్ పీస్‌గా నిలబెట్టింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ది ఒడిస్సీ.. నోలెన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్..!

Follow Us