ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..

ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌ (Jai Bhim) సినిమాలతో సక్సెస్‌ మీద ఉన్నారు సూర్య. రెండు ఓటీటీ రిలీజుల తర్వాత సూర్య నటించిన ఈటీ (ET)

ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..
Suriya
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: Mar 10, 2022 | 2:40 PM

ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌ (Jai Bhim) సినిమాలతో సక్సెస్‌ మీద ఉన్నారు సూర్య. రెండు ఓటీటీ రిలీజుల తర్వాత సూర్య నటించిన ఈటీ (ET) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలోనూ ఓ కీలక సమస్య గురించి మాట్లాడామని ముందే ప్రకటించారు డైరక్టర్‌ పాండిరాజ్. ఇంతకీ ఏంటది? సినిమాలో సూచించిన పరిష్కారం సొసైటీలో మార్పు తెస్తుందా? చూద్దాం..!

నిర్మాణ సంస్థ: సన్‌ పిక్చర్స్

నటీనటులు: సూర్య, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, వినయ్‌ రాయ్‌, సత్యరాజ్‌, శరణ్య, జయప్రకాష్‌, దేవదర్శిని, సూరి తదితరులు

నిర్మాత: కళానిధి మారన్‌

రచన – దర్శకత్వం: పాండిరాజ్‌

సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు

ఎడిటింగ్‌: రూబెన్‌

సంగీతం: డి.ఇమాన్‌

విడుదల: మార్చి 10, 2022

అర్థం చేసుకునే తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటాడు లాయర్‌ కృష్ణమోహన్‌ (సూర్య). అతనికి ఓ సందర్భంలో అదీరా (ప్రియాంక అరుళ్‌ మోహన్‌)పరిచయమవుతుంది. ఆమెతో పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే కృష్ణమోహన్‌ ఉంటున్న దక్షిణపురానికి, ప్రియాంక ఉంటున్న ఉత్తరపురానికి మధ్య గొడవలుంటాయి. ఆ రెండు ఊళ్ల మధ్య వైవాహిక బంధాలు కలిసి రెండేళ్లు అయి ఉంటుంది. కానీ రెండు ఊళ్ల సరిహద్దుల్లో జరిగే సుబ్రహ్మణ్య జాతరలో అదీరాను పెళ్లి చేసుకుంటాడు కృష్ణమోహన్‌. అక్కడిదాకా అంతా సవ్యంగానే అనిపించినా, అదీరా స్నేహితురాలు రాగిణి చిక్కుల్లో పడటంతో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రాగిణి ఫేస్‌ చేసిన సమస్య ఏంటి? అంతకు ముందు మోనికకు కూడా అదే ఎదురైందా? కృష్ణమోహన్‌కి బాబాయ్‌లాంటి ఫ్యామిలీ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అసలు సెంట్రల్‌ మినిస్టర్‌ కొడుకు కామేష్‌ (వినయ్‌ రాయ్‌)ఎవరు? అతని గ్యాంగ్‌ చేసిన పని వల్ల అదీరాకు కలిగిన నష్టం ఏంటి? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

బాధ్యత కల కొడుకుగా, ఆలోచన ఉన్న లాయర్‌గా నటించడం సూర్యకు కొత్తేం కాదు. అలవాటైన పంథాలో చాలా బాగా చేశారు. శరణ్యకు పక్కాగా సరిపోయే రోల్‌ ఆమె చేశారు. మర్యాదస్తుడైన తండ్రి కేరక్టర్‌ సత్యరాజ్‌కి పక్కాగా సూట్‌ అయింది. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిన పాత్రలోనూ, తనకు ఓ బాధ వచ్చినప్పుడు తన వారి సపోర్ట్ తో అందులో నుంచి బయటపడినప్పుడు ప్రియాంక నటన బావుంది. దర్శకుడు ఎంపిక చేసుకున్న కథ… నేటి సమాజంలో జరుగుతున్నదే. నేటి యువతకు, వారి తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నదే. ఒకానొక సందర్భం దాకా ఇంట్రస్టింగ్‌గానే నడిపారు కథని. కానీ ఉన్నట్టుండి ఎక్కడో స్టోరీ సింగిల్‌ సైడ్‌ తీసుకున్నట్టు అనిపిస్తుంది.

అప్పటిదాకా అన్నిటినీ చేసిన విలన్‌, ఉన్నట్టుండి హీరోకి అయాచితంగా పట్టుబడ్డట్టు కనిపిస్తాడు. చెడు విషయాలకు అలవాటు పడ్డ పిల్లలను వాళ్ల తల్లిదండ్రుల ముందే శిక్షించడం అనే కాన్సెప్ట్ కూడా చాలా మందికి నచ్చేదే. కానీ ఎమోషన్స్ ఇంకాస్త బలంగా ఉండాల్సిందేమో.

అమ్మాయిల ఫోన్లలో ఏవేవో యాప్స్ ఉంటాయి. కానీ ఆపదల్లో ఉన్నప్పుడు… అత్యవసర సమయాల్లో వాడాల్సిన యాప్స్ ఎంత మంది ఫోనుల్లో ఉంటున్నాయి? ప్రభుత్వాలు అదేపనిగా నెత్తీనోరు బాదుకుని చెప్పినా ఎందుకు అవగాహన రావడం లేదు? సొంత ఇంట్లోనే కొన్ని సార్లు అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు, బయటి వ్యక్తులను ఎంత వరకు నమ్మాలి? వారిలో ఎలా మెలగాలి? తెలిసో తెలియకో జరగరానిది జరిగినప్పుడు కుమిలిపోతూ కూర్చోవాలా? అలాంటి వాటికి ఎదురొడ్డి ఎలా పోరాడాలి? వంటివాటి గురించి అర్థవంతమైన డిస్కషన్‌ జరిగింది.

అంతే కాదు.. ఇంట్లో వ్యక్తికి జరగకూడని అన్యాయం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎలా అండగా నిలుచోవాలి? అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. కాకపోతే సన్నివేశాలను ఇంకాస్త బలంగా రాసుకుని, భావోద్వేగాలను ఇంకాస్త లోతుగా తెరకెక్కించాల్సింది. ఒక మాటలో చెప్పాలంటే… నారీలోకానికి ఏదో చెప్పాలని ప్రయత్నించిన సినిమా ఈటీ.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

Also Read: Chiranjeevi: ఆడపడుచులను సొంత బిడ్డల్లా చూసుకునే చిరు భార్య సురేఖ.. కోట్ల విలువజేసే ఆస్తులను రాఖీ గిప్ట్ ఇచ్చిన వైనం

Viral Photo: అందానికి పర్యాయపదం.. ఆమె కళ్లలోనే తెలియని ఇంద్రజాలం.. ఒక్క సినిమాతో సెన్సేషన్

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..