AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?

తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పక్కా గ్రామీణ చిత్రం పాపం ప్రతాప్. 1990ల నాటి గోదావరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో.. ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Papam Prathap: పాపం ప్రతాప్ సినిమా రివ్యూ.. తిరువీర్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..?
Papam Prathap Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 8:01 AM

Share

మూవీ రివ్యూ: పాపం ప్రతాప్

నటీనటులు: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్, రాశీ, అవసరాల శ్రీనివాస్, రూపా లక్ష్మి, గోపరాజు రమణ తదితరులు

సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ ఎస్.వి

ఇవి కూడా చదవండి

ఎడిటర్: అన్వర్ అలీ

సంగీతం: కేఎం రాధాకృష్ణన్

నిర్మాతలు: రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరే

దర్శకుడు: ఎస్‌పి దుర్గా నరేష్

కథ:

1990ల కాలం నాటి గోదావరి జిల్లా గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్) తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అంతా సంతోషంగా ఉందనుకునేలోపు, పెళ్లయిన మూడు రోజులకే జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల ఊరి పంచాయితీలో ప్రతాప్‌కు ఘోర అవమానం జరుగుతుంది. ఈ దెబ్బతో బుజ్జమ్మ ప్రతాప్‌ను వదిలి వెళ్లిపోతుంది. భార్య దూరమవడంతో ఊరి జనం అంతా ప్రతాప్‌ను చూసి పాపం ప్రతాప్ అంటూ జాలి పడుతూనే వెటకారం చేస్తూ ఉంటారు. దీనికి తోడు ప్రతాప్‌కు నిద్రలో ఓ వింత సమస్య కూడా ఉంటుంది. పగలు ఒకలాగా.. పడుకుంటే ఒకలాగా మారిపోతుంటాడు ప్రతాప్. ఊరి వాళ్ల హేళనను తట్టుకుని, ప్రతాప్ తన భార్యను మళ్లీ ఎలా దక్కించుకున్నాడు, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుని పాపం ప్రతాప్ కాస్తా వీర ప్రతాప్‌గా ఎలా ఎదిగాడు అనేది మిగతా కథ..

కథనం:

కథగా చూస్తే పాపం ప్రతాప్ చాలా చిన్న పాయింట్. దర్శకుడు ఎస్.పీ. దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్, పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. ఫస్టాఫ్ అంతా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల అమాయకత్వంతో కూడిన కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది. మధ్యతరగతి భర్త పడే కష్టాలు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే ఇంత చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమాగా మలచడం అనేది కత్తిమీద సాము లాంటిదే. పైగా హీరోలకు లోపాలు ఉన్న కథలకు డిమాండ్ బాగా ఉంటుంది.. కాస్త బాగా రాసుకుంటే సినిమా ఈజీగా అలా వెళ్లిపోతుంది. పాపం ప్రతాప్ సినిమా విషయంలో దర్శకుడు దుర్గా నరేష్ ఇదే చేయాలని చూసాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా బాగానే వెళ్లిపోతుంది. హీరోకు ఉన్న సమస్యేంటి అనేది ల్యాగ్ చేయకుండా త్వరలోనే రివీల్ చేసాడు దర్శకుడు.. ఇంటర్వెల్ నాటికి మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు.. అయితే కీలకమైన ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. ప్రతాప్ భార్య వదిలి వెళ్లిపోయిందని ఊరి జనం నానా మాటలు అనే సీన్స్ మొదట్లో నవ్వించినా రాను రాను అవే రిపీట్ అవ్వడంతో కొంత బోర్ కొడుతుంది. అలాగే హీరోకి ఉన్న నిద్ర సమస్య మీద ఇంకాస్త లోతుగా చెప్పుంటే బాగుండేది. దానికితోడు మధ్యలో వచ్చే కొన్ని డబుల్ మీనింగ్ జోకులు, సీన్లు అవసరం లేదేమో అనిపించింది. అవి లేకపోయినా సినిమాకు పెద్దగా సమస్య లేదు.. అలాంటి సన్నివేశాలు తీసేసి సినిమాను మరింత క్రిస్పీగా 2 గంటల్లో తేల్చేసి ఉంటే చాలా మంచి సినిమా అయ్యుండేది పాపం ప్రతాప్. అయితే కమర్షియల్ హంగులకు పోకుండా ప్యూర్ ఎమోషన్స్ మీద ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు దుర్గా నరేష్. హీరోకు ఆ సమస్య ఎలా వచ్చిందనే ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.. క్లైమాక్స్ ఓకే..!

నటీనటులు:

మసూద, పరేషాన్ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్.. ప్రతాప్ పాత్రలో ఒదిగిపోయాడు. భార్య దూరమైన బాధను, అవమానాలను దిగమింగుకునే సగటు యువకుడిగా అద్భుతమైన నటనను కనబరిచాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చాలా సహజంగా నటించింది. పల్లెటూరి అమ్మాయిగా సెట్ అవ్వడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో తన వంతు న్యాయం చేసింది. ఇక అజయ్ ఘోష్, రఘుబాబు, గోపరాజు రమణల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలం. చాలా కాలం తర్వాత సీనియర్ నటి రాశి ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ టీం:

చాలా ఏళ్ళ తర్వాత సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించిన సినిమా ఇది.. పాటలు బాగున్నాయి.. పల్లెటూరి నేపథ్యానికి తగ్గట్టుగా అందించిన సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం భావోద్వేగాలను బాగానే ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ విశ్వేశ్వర్ ఎస్.వి గోదావరి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని కెమెరాలో చాలా అందంగా బంధించారు. విజువల్స్ సినిమాకు ఫ్రెష్ ఫీల్‌ను తెచ్చాయి. అన్వర్ అలీ ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్టాఫ్ క్రిస్ప్‌గా ఉన్నా, ద్వితీయార్థంలో సాగదీతగా అనిపించే కొన్ని రిపీటెడ్ సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర పడి ఉంటే బాగుండేది. ముఖ్యంగా డబుల్ మీనింగ్ జోకులు లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు కథా నేపథ్యానికి తగ్గట్లుగా, రాజీ పడకుండా చాలా బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథాంశం చిన్నదే అయినా.. 90ల నాటి గోదావరి నేటివిటీని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా పాపం ప్రతాప్.. పల్లెటూరి కథ.. డీసెంట్ ఎంటర్‌టైనర్..!

Follow Us