పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఈసారి యాక్షన్‌తో అదరగొట్టడానికి రెడీ!
ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు.. వెండితెరపై సావిత్రిని పునఃసృష్టించి నేషనల్ అవార్డును గెలుచుకున్న అభినేత్రి. మలయాళ మూలాలు ఉన్నప్పటికీ, తెలుగు ప్రేక్షకులు తనను తమ ఇంటి ఆడపడుచులా గుండెల్లో దాచుకున్నారు. నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్లకు ప్రాధాన్యమిస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

‘నేను శైలజ’ అంటూ మొదలైన ఆమె ప్రయాణం మహానటిగా శిఖరాగ్రానికి చేరింది. అయితే దక్షిణాదిని ఏలిన ఈ సుందరి, బాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో బోణీ కొట్టలేకపోయింది. తన మొదటి హిందీ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని ఇచ్చినా, ఆమెలోని పట్టుదల, వృత్తి పట్ల ఉన్న నిబద్ధత చూసి బాలీవుడ్ మేకర్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తలుపు ఒక బంపర్ ఆఫర్ తట్టింది. బాలీవుడ్ యంగ్ యాక్షన్ స్టార్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ నటి మరెవరో కాదు.. కీర్తి సురేష్.

Keerthy Suresh..
బాలీవుడ్ లో మరోసారి..
కీర్తి సురేష్ తన మొదటి హిందీ సినిమాగా వరుణ్ ధావన్ సరసన ‘బేబీ జాన్’ లో నటించింది. దళపతి విజయ్ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో సమంత పోషించిన ఎమోషనల్ పాత్రను కీర్తి పోషించింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన ఆ కథ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో కీర్తి తొలి అడుగు సరిగ్గా పడలేదు. కానీ సినిమా ఫలితం ఎలా ఉన్నా, పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే బాధ్యతగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రొఫెషనలిజం చాటుకుంది. ఆమె డెడికేషన్‌కు మెచ్చిన బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఒక భారీ యాక్షన్ సినిమాలో కీర్తిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది.
టైగర్ ష్రాఫ్ జంటగా..
టైగర్ ష్రాఫ్ సినిమాలంటేనే ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లకు పెట్టింది పేరు. ఇప్పుడు ఆయన సరసన కీర్తి సురేష్ నటిస్తుండటంతో ఈ కాంబోపై ఆసక్తి పెరిగింది. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ‘తుపాకీ’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ కూడా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారట. ఇద్దరు యాక్షన్ స్టార్లు ఉన్న సినిమాలో కీర్తి పాత్ర ఎంత బలంగా ఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.
పెళ్లి తర్వాత..
చిరకాల ప్రియుడు ఆంటోనీతో వివాహం తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ లో కీర్తి కీలక పాత్ర పోషిస్తోంది. దీనితో పాటు తన మొదటి వెబ్ సిరీస్ ‘అక్క’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళం, మలయాళ భాషల్లో కూడా క్రేజీ ప్రాజెక్టులతో కీర్తి బిజీగా గడుపుతోంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన కీర్తి సురేష్, ఈ రెండో ప్రయత్నంతోనైనా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుందో లేదో చూడాలి. టైగర్ ష్రాఫ్ లాంటి డైనమిక్ హీరోతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
