ప్రముఖ దూరదర్శన్ సీరియల్ ‘ఉడాన్’ నటి కవితా చౌదరి (67) కన్నుమూశారు. గురువారం రాత్రి ఆసుపత్రిలో గుండెపోటుతో ఆమె మరణించారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో అమృత్‌సర్‌లోని పార్వతి దేవి హాస్పిటల్‌లో చేరిన ఆమె గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత విషమించి ఆసుపత్రిలోనే కన్నుమూసినట్లు కవితా చౌదరి మేనల్లుడు, నటుడు అజయ్ సయల్ మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. నటుడు అమిత్ బెహ్ల్‌తోపాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చౌదరి మృతికి సంతాపం తెలిపారు.
కాగా 1989-1991 మధ్యకాలంలో దూరదర్శన్ ప్రసారమైన మహిళా సాధికారత ప్రోగ్రెసివ్ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారి కళ్యాణి సింగ్ పాత్రలో కవితా చౌదరి బాగా పాపులర్ అయ్యారు. ఆమె ఈ సీరియల్‌లో నటించడమేకాకుండా తన సొంత అక్క పోలీస్ అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య జీవితం నుంచి ప్రేరణ పొంది, స్వయంగా కథరాసి దర్శకత్వం వహించారు. ఈ సీరియల్‌లో శేఖర్ కపూర్ కూడా నటించారు. ఐపీఎస్ అధికారి కావాలనుకునే మహిళ పోరాటం చుట్టూ ఉడాన్ సీరియల్ కథ తిరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సీరియల్ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ను తిరిగి ప్రసారం చేశారు. ఆ తర్వాత కవితా చౌదరి దూరదర్శన్‌లో యువర్ హానర్, IPS డైరీస్ షోలను కూడా నిర్మించారు. అంతేకాకుండా తొలినాళ్లలో సర్ఫ్ యాడ్స్‌లోనూ ఆమె నటించారు.
కవిత నటించిన ఉడాన్ సీరియల్ రాజకీయ నేత స్మృతి ఇరానీపై కూడా ప్రభావం చూపింది . ఆమె షో రీ-రన్ గురించిన వార్తలను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ‘కొందరికి ఇది కేవలం సీరియల్ మాత్రమే. నేను అధిగమించడం అసాధ్యంగా భావించే పరిస్థితుల నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి ఇది ఒక పిలుపు’ అని పేర్కొన్నారు. కాగా నటి కవిత భారతీయ టెలివిజన్‌లో చెరగని ముద్ర వేశారని చెప్పవచ్చు. నటన పట్ల ఆమెకున్న అంకితభావం, భావోద్వేగాలను రేకెత్తించే సామర్థ్యం ప్రేక్షకులకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.