నేపాల్‌కు అండగా “కే” పాప్ స్టార్ లీ నో..రూ. 69 లక్షలు విరాళం
కొరియా గాయకుడు లీ నో తన మంచి మనసు చాటుకున్నారు. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్ లో సహాయక కార్యక్రమాలకు సాయంగా దక్షిణ కొరియా కరెన్సీలో 100 మిలియన్ వన్‌లను విరాళంగా ఇచ్చారు. భారత కరెన్సీలో అది దాదాపు రూ.69 లక్షలు.

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్ కు సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా కొరియా గాయకుడు లీ నో తన మంచి మనసు చాటుకున్నారు. నేపాల్ వరద బాధితుల కోసం ఆయన దక్షిణ కొరియా కరెన్సీలో 100 మిలియన్ వన్‌లను విరాళంగా ఇచ్చారు. మన భారత కరెన్సీలో దాదాపు రూ.69 లక్షలు అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేయడానికి ఈ డబ్బును ‘వరల్డ్ విజన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన పంపించారు.
“ఈ కష్ట సమయంలో నేపాల్‌ను ఆదుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. వీలైనంత త్వరగా ఆ దేశ ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని లీ నో తెలిపారు. కొరియాకు చెందిన ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్ ‘స్ట్రే కిడ్స్’లో ఆయనొక సభ్యుడు. పాటలతో కోట్లాది మందిని అలరించే లీ నో, ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందే ఉంటారు.
2014 నుంచి ‘వరల్డ్ విజన్’ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల సంరక్షణ కోసం ఆయన సాయం అందిస్తున్నారు. 2024లో ఆహార కొరతతో అల్లాడుతున్న దేశాల కోసం 100 మిలియన్ వన్‌ల విరాళం ఇచ్చారు. అలాగే, గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారి కోసం కూడా భారీగా విరాళాలు అందజేశారు.
కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా
నేపాల్ టిబెట్ సరిహద్దు జిల్లాలను అతలాకుతలం చేసిన వరదల వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని చూసిన ప్రముఖ నటి మనీషా కొయిరాలా కన్నీళ్లు పెట్టుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. . నేపాల్ రాజకుటుంబీకుల ఫ్యామిలీకి చెందిన ఆమె అక్కడి వరద బాధితుల దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. తన సోషల్ మీడియా వేదికల ద్వారా ఆవేదన పంచుకున్నారు. “నా మాతృభూమి పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. స్వచ్ఛంద సంస్థలు వెంటనే స్పందించి నేపాల్ ప్రజలకు, వరద బాధితులకు అవసరమైన ఆహారం, వైద్యం అందించాలి,” అని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు చైనా, భారత్ నేపాల్ కు అండగా నిలవాలని, తాను కూడా వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో పాల్గొంటానని తెలిపారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ కూడా నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. నేపాల్ పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి విరాళం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నేపాల్ వరదల్లో ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతైన సంగతి తెలిసిందే.